Rohit Sharma: కోహ్లి, రోహిత్‌లను అవుట్‌ చేస్తే చాలు.. సగం జట్టు పెవిలియన్‌ చేరినట్లే! స్కోరులో 60- 70 పరుగులు తగ్గించినట్లే!

Asghar Afghan: We Used To Say Get Kohli Rohit Out Half Of Team India Finished - Sakshi

Legends League Cricket 2022- Asghar Afghan- Team India- T20 World Cup 2022: టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, మాజీ సారథి, స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి గురించి అఫ్గనిస్తాన్‌ మాజీ కెప్టెన్‌ అస్గర్‌ అఫ్గన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత్‌తో మ్యాచ్‌లో ఈ ఇద్దరిని అవుట్‌ చేస్తే సగం జట్టును పెవిలియన్‌కు పంపినట్లే భావించేవాళ్లమని పేర్కొన్నాడు. ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పగల సత్తా వీరి సొంతమంటూ హిట్‌మ్యాన్‌ రోహిత్‌, రన్‌మెషీన్‌ కోహ్లిలను కొనియాడాడు.

గంభీర్‌ సారథ్యంలో..
లెజెండ్స్‌ లీగ్‌ క్రికెట్‌-2022లో అస్గర్‌ అఫ్గన్‌ ఇండియా క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. టీమిండియా మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌ సారథ్యంలో అతడు ఆడనున్నాడు. ఈ నేపథ్యంలో ఇండియాకు వచ్చిన అస్గర్‌ హిందుస్థాన్‌ టైమ్స్‌తో ప్రత్యేకంగా ముచ్చటించాడు.

ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఆసియా కప్‌-2022లో టీమిండియా ప్రదర్శన, టీ20 ప్రపంచకప్‌-2022లో రోహిత్‌ సేన విజయావకాశాలపై తన అభిప్రాయాలు తెలిపాడు. టీమిండియాతో మ్యాచ్‌ సందర్భంగా.. టీ20లలో రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లిలను ఎదుర్కొనేందుకు ఎలాంటి వ్యూహాలు రచించేవాళ్లు అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘ఇండియాతో మ్యాచ్‌ అంటేనే.. మా మొదటి ప్రాధాన్యం.. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి వికెట్లే! 

కోహ్లిని ఆపడం కష్టం!
వాళ్లిద్దరినీ అవుట్‌ చేస్తే సగం జట్టును అవుట్‌ చేసినట్లే అని అనుకునేవాళ్లం. ప్రపంచంలోని మేటి బ్యాటర్లు అయిన వీళ్లిద్దరి గురించే మా చర్చంతా! ఎందుకంటే ఒంటిచేత్తో వాళ్లు మ్యాచ్‌ను మలుపు తిప్పగలరు! 

అందుకే... ముందు రోహిత్‌, కోహ్లిలను అవుట్‌ చేస్తే చాలు అనుకునేవాళ్లం. లేదంటే.. టీమిండియాను ఎదుర్కోవడం మరింత కష్టతరంగా మారుతుందని మాకు తెలుసు. ముఖ్యంగా విరాట్‌ కోహ్లి.. ఒక్కసారి క్రీజులో కుదురుకుంటే తనని ఆపడం కష్టం. రోహిత్‌, కోహ్లిలను పెవిలియన్‌కు పంపితే వన్డేల్లో టీమిండియా స్కోరులో 100- 120... టీ20లలో 60- 70 పరుగులు తగ్గించవచ్చని భావించేవాళ్లం’’ అని అస్గర్‌ అఫ్గన్‌ చెప్పుకొచ్చాడు.

ఆసియాకప్‌లో ఓటములకు అదే కారణం! అయితే..
ఇక ఆసియా కప్‌-2022లో రోహిత్‌ సేన సూపర్‌-4లో వరుస మ్యాచ్‌లు ఓడటానికి రవీంద్ర జడేజా లేకపోవడం కూడా ఒక కారణమని అస్గర్‌ అభిప్రాయపడ్డాడు. అయితే, ఈ టోర్నీలో ఓడినంత మాత్రాన టీమిండియాను తక్కువగా అంచనా వేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నాడు.

ఆస్ట్రేలియా వేదికగా జరుగనున్న వరల్డ్‌కప్‌ రూపంలో వారికి మంచి అవకాశం వచ్చిందని.. కచ్చితంగా టీమిండియా ఈ ఛాన్స్‌ను ఉపయోగించుకుంటుందని చెప్పుకొచ్చాడు. ఇక గత కొంతకాలంగా నిలకడలేమి ఫామ్‌తో ఇబ్బంది పడిన విరాట్‌ కోహ్లి.. ఆసియాకప్‌లో అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌లో అజేయ శతకంతో రాణించి విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. గతేడాది మేలో కెప్టెన్సీ కోల్పోయిన అస్గర్‌ అఫ్గన్‌.. టీ20 ప్రపంచకప్‌ టోర్నీ-2021లో నమీబియాతో మ్యాచ్‌కు ముందు అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్‌ ప్రకటించాడు.

చదవండి: T20 WC: ఇదే లాస్ట్‌ ఛాన్స్‌! అదే జరిగితే బాబర్‌ ఆజం కెప్టెన్సీ కోల్పోవడం ఖాయం!
Ind Vs Aus: భారత్‌ వర్సెస్‌ ఆస్ట్రేలియా.. పూర్తి షెడ్యూల్‌, జట్లు.. ఇతర వివరాలు!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top