కర్ణాటక కెప్టెన్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ తనయుడు అన్వయ్‌ ద్రవిడ్‌

Anvay Dravid, Son Of Rahul Dravid Appointed As Karnataka U14 Team Captain - Sakshi

టీమిండియా హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ చిన్న కొడుకు అన్వయ్‌ ద్రవిడ్‌ కర్ణాటక క్రికెట్‌ జట్టు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఓ ఇంటర్ జోనల్ అండర్‌-14 టోర్నమెంట్‌లో అ‍న్వయ్‌ కర్ణాటక టీమ్‌ను లీడ్ చేయనున్నాడు. వికెట్‌కీపర్‌ కమ్‌ బ్యాటర్‌ అయిన అన్వయ్‌.. గతకొంతకాలంగా విశేషంగా రాణిస్తూ, తన స్వయం కృషితో సారధిగా నియమించబడ్డాడు.

రాహుల్‌ ద్రవిడ్‌ పెద్ద కొడుకు, అన్వయ్‌ అన్న సమిత్‌ ద్రవిడ్‌ కూడా క్రికెటర్‌గా అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న విషయం తెలిసిందే. సమిత్‌.. 2019-20 సీజన్‌లో అండర్‌-14 క్రికెట్‌లో రెండు డబుల్‌ సెంచరీలు బాది వార్తల్లో నిలిచాడు. ఇప్పుడు సమిత్‌ తమ్ముడు అన్వయ్‌ కూడా అన్న తరహాలోనే రాణించి, తండ్రికి తగ్గ తనయుడనిపించుకోవాలని ఉవ్విళ్లూరుతున్నాడు.

అన్వయ్‌ కూడా తండ్రి రాహుల్‌ ద్రవిడ్‌ లాగే వికెట్‌కీపర్‌ కమ్‌ బ్యాటర్‌ కావడంతో తండ్రిలాగే సక్సెస్‌ అవుతాడని అందరూ అనుకుంటున్నారు. ధోనికి ముందు టీమిండియాకు సమర్ధవంతుడైన రెగ్యులర్‌ వికెట్‌కీపర్‌ లేకపోవడంతో ద్రవిడ్‌ చాన్నాళ్ల పాటు వికెట్‌కీపింగ్‌ భారాన్ని మోసాడు. ధోని రాకతో ద్రవిడ్‌ బ్యాటింగ్‌పై మాత్రమే ప్రత్యేక దృష్టి సారించి ఎన్నో రికార్డులు బద్దలు కొట్టాడు. 

ఇదిలా ఉంటే, టీమిండియా హెడ్‌ కోచ్‌గా వ్యవహరిస్తున్న రాహుల్‌ ద్రవిడ్‌ ప్రస్తుతం భారత్‌-న్యూజిలాండ్‌ వన్డే సిరీస్‌తో బిజీగా ఉన్నాడు. ద్రవిడ్‌ కోచింగ్‌లో భారత్‌ ఇటీవలి కాలంలో వరుస విజయాలతో దూసుకుపోతుంది. తాజాగా అతని ఆధ్వర్యంలో టీమిండియా.. న్యూజిలాండ్‌ను తొలి వన్డేలో 12 పరుగుల తేడాతో ఓడించి, 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. జనవరి 21న రాయ్‌పూర్‌ వేదికగా టీమిండియా-కివీస్‌ జట్ల మధ్య రెండో వన్డే జరుగనుంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top