IPL 2022: ఢిల్లీ క్యాపిటల్స్‌కు భారీ షాక్.. సీజన్‌ మొత్తానికి దూరం కానున్న స్టార్ బౌలర్..!

Anrich Nortje Doubtful For IPL 2022 Season - Sakshi

ఐపీఎల్‌ 15వ సీజన్‌ ప్రారంభానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టుకు భారీ షాక్‌ తగిలింది. ఆ జట్టు స్టార్‌ పేసర్‌, దక్షిణాఫ్రికా బౌలర్‌ అన్రిచ్‌ నోర్జే సీజన్ మొత్తానికి దూరం కానున్నాడని తెలుస్తోంది. గతేడాది ఐపీఎల్ సందర్భంగా గాయపడ్డ నోర్జే ఇంకా కోలుకోలేదు. గతేడాది టీ20 ప్రపంచకప్‌తో పాటు ఇటీవల టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటనకు కూడా అతను అందుబాటులో లేడు. తాజాగా స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌ కోసం ప్రకటించిన దక్షిణాఫ్రికా జట్టులో కూడా నోర్జేకు స్థానం లేదు. దీంతో నోర్జే గాయానికి సంబంధించిన సమాచారం కోసం ఢిల్లీ జట్టు.. బీసీసీఐని సంప్రదించింది క్రికెట్‌ సౌతాఫ్రికాతో చర్చలు జరపాలని కోరింది. 

కాగా, ఐపీఎల్‌ 2022 మెగా వేలానికి ముందు జరిగిన రిటెన్షన్ ప్రక్రియలో భాగంగా రిషబ్‌ పంత్, పృథ్వీ షా, అక్షర్ పటేల్, నోర్జేలను డీసీ జట్టు రిటైన్ చేసుకుంది. నోర్జేకు డీసీ రూ. 6.5 కోట్లు ముట్టజెప్పి అట్టిపెట్టుకుంది. మరోవైపు, నోర్జేతో పాటు ఐపీఎల్‌లో పాల్గొనాల్సి ఉన్న ఇతర దక్షిణాఫ్రికా ఆటగాళ్లకు సంబంధించి కూడా బీసీసీఐ.. క్రికెట్‌ సౌతాఫ్రికాతో సంప్రదించనుంది. ఐపీఎల్‌ ప్రారంభ సమయానికి సఫారీ జట్టు బంగ్లాదేశ్‌తో టెస్ట్‌, వన్డే సిరీస్‌లు ఆడాల్సి ఉన్న నేపథ్యంలో లీగ్‌ ఆరంభ మ్యాచ్‌లకు ఆ దేశ ఆటగాళ్లు అందుబాటులో ఉంటారా..? లేదా..? అన్న విషయంపై బీసీసీఐ క్లారిటీ కోరనుంది. 

ఐపీఎల్ 2022 సీజన్‌ ఈ నెల 26 నుంచి ప్రారంభమవుతుండగా.. బంగ్లా-దక్షిణాఫ్రికా సిరీస్‌లు ఈనెల 18న ప్రారంభమై, ఏప్రిల్ 12న ముగుస్తాయి. ఈ షెడ్యూల్‌ ప్రకారం దక్షిణాఫ్రికా ఆటగాళ్లు కనీసం మూడు వారాలైనా ఐపీఎల్‌కు దూరంగా ఉండాల్సి వస్తుంది. కగిసొ రబాడా, మార్కో జన్సెన్, ఎయిడెన్ మార్క్రమ్, రస్సీ వాన్ డర్ డసెన్, లుంగి ఎంగిడి,  క్వింటన్ డికాక్ వంటి ఆటగాళ్లు పలు ఐపీఎల్ జట్లతో ఒప్పందం కుదుర్చుకున్నారు. వీరిలో డికాక్ టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించడంతో అతను ఐపీఎల్‌ ప్రారంభం నుంచే అందుబాటులో ఉండే అవకాశముంది. కాగా, జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించే అంశాన్ని ఆటగాళ్ల విజ్ఞతకే వదిలిపెట్టినట్లు దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. 
చదవండి: జట్టును ప్రకటించిన దక్షిణాఫ్రికా.. స్టార్‌ బౌలర్‌ దూరం

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top