WPL 2023: చెలరేగిన మరిజన్, షఫాలీ.. ఢిల్లీ చేతిలో గుజరాత్‌ చిత్తు

An all round performance by Delhi Capitals is an extraordinary win - Sakshi

ఢిల్లీ మెరుపు విజయం  

10 వికెట్లతో గుజరాత్‌ చిత్తు

Gujarat Giants vs Delhi Capitals Women- ముంబై: మహిళల ప్రీమియర్‌ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అసాధారణ విజయం సాధించింది. బౌలింగ్‌లో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ మరిజన్‌ కాప్‌ (5/15), బ్యాటింగ్‌లో షఫాలీ వర్మ (28 బంతుల్లో 76 నాటౌట్‌; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) చెలరేగారు. దీంతో ఢిల్లీ 10 వికెట్ల తేడాతో గుజరాత్‌ జెయింట్స్‌పై జయభేరి మోగించింది. టాస్‌ నెగ్గి మొదట బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది.

లోయర్‌ ఆర్డర్‌లో కిమ్‌ గార్త్‌ (37 బంతుల్లో 32 నాటౌట్‌; 3 ఫోర్లు) ఇన్నింగ్స్‌ టాప్‌ స్కోరర్‌గా నిలిచింది.  హర్లీన్‌ డియోల్‌ (14 బంతుల్లో 20; 4 ఫోర్లు), జార్జియా వేర్‌హామ్‌ (25 బంతుల్లో 22; 2 ఫోర్లు) కాస్త మెరుగ్గా ఆడారు. ఢిల్లీ మీడియం పేసర్‌ మరిజన్‌ (4–0–15–5) బెంబేలెత్తించింది. శిఖాపాండేకు 3 వికెట్లు దక్కాయి. బ్యాటింగ్‌ ఆర్డర్‌లోని తొలి 4 వికెట్లను మరిజనే పడగొట్టింది. దీంతో 28 పరుగులకే గుజరాత్‌ 5 వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ వికెట్‌ నష్టపోకుండా కేవలం 7.1 ఓవర్లలో 107 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు షఫాలీ, కెప్టెన్‌ మెగ్‌ లానింగ్‌ (15 బంతుల్లో 21 నాటౌట్‌; 3 ఫోర్లు) అజేయమైన ఓపెనింగ్‌ భాగస్వామ్యంతో జట్టుకు అలవోక విజయం అందించారు. గార్డ్‌నెర్‌ వేసిన 4వ ఓవర్లో షఫాలీ, లానింగ్‌ కలిసి 4, 4, 6, 1, 4, 4లతో 23 పరుగులు రాబట్టడం విశేషం. షఫాలీ 19 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకుంది. 

డబ్ల్యూపీఎల్‌లో నేడు
ముంబై  ్ఠ Vs యూపీ వారియర్స్‌ 
రాత్రి గం. 7:30 నుంచి  స్పోర్ట్స్‌ 18 చానెల్‌లో, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top