అఫ్గానిస్తాన్, భారత్-ఎ అండర్-19 మక్కోణపు వన్డే టోర్నీలో భారత్-బి జట్టు వరుసగా రెండో ఓటమి చవిచూసింది. బెంగళూరు వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్-బి జట్టును 71 పరుగుల తేడాతో అఫ్గానిస్తాన్ చిత్తు చేసింది. కేవలం 169 పరుగుల లక్ష్యాన్ని చేధించలేక భారత్-బి జట్టు చతికలపడింది. అఫ్గాన్ బౌలర్ల దాటికి భారత్ 29.3 ఓవర్లలో కేవలం 97 పరుగులకే కుప్పకూలింది.
యువరాజ్ ఒంటరి పోరాటం
ఓపెనర్ యువరాజ్ గోహిల్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. యువరాజ్ 80 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 60 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడికి ఇతరల నుంచి కనీస సపోర్ట్ లభించలేదు. అఫ్గాన్ పేసర్ అబ్దుల్ అజీజ్ 6 వికెట్లతో టీమిండియా పతనాన్ని శాసించాడు.
తన 10 ఓవర్ల కోటాలో కేవలం 38 పరుగులు మాత్రమే ఇచ్చి ఆరు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అందులో ఓ హ్యాట్రిక్ కూడా ఉంది. అతడితో పాటు సలీం ఖాన్, జద్రాన్ తలా రెండు వికెట్లు సాధించారు.
ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ యువ జట్టు ఇండియా బౌలర్లు చెలరేగడంతో 45.2 ఓవర్లలో 168 పరుగులకు ఆలౌటైంది. అఫ్గాన్ బ్యాటర్లలో ఫైసల్ షినోజాడా(58) టాప్ స్కోరర్‌గా నిలవగా.. అజీజుల్లా మియాఖిల్(42) ఫర్వాలేదన్పించారు.
మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. అంతకుముందు ఇండియా-ఎతో జరిగిన మ్యాచ్‌లో కూడా జార్జ్ సారథ్యంలోని భారత్ ఓటమి పాలైంది.
చదవండి: IPL 2026: ‘పెంచి, పోషించి.. అతడిని ఎలా వదిలేశారు?’


