ఆత్మీయ ఆహ్వానం.. కొత్త కోడలికి మెట్టుకో గిఫ్ట్‌

Viral In Laws Family Invites New Bride With Cash And Many Gifts - Sakshi

వరకట్న పిశాచి మన సమాజంలో ఎందరు ఆడవాళ్లని బలి తీసుకుందో లెక్కేలేదు. భార్య తల్లిదండ్రులంటేనే నడిచే ఏటీఎంలా కనిపిస్తారు కొందరు భర్తలకు. పెళ్లికి ముందే భారీగా కట్నం తీసుకున్నప్పటికి వారి ధనదాహం తీరదు. వివాహం తర్వాత కూడా అదనపు కట్నం తేవాల్సిందిగా వేధింపులకు గురి చేస్తారు. చిత్రహింసలు పెట్టి.. చివరకు ప్రాణాలు తీస్తారు. అత్తమావలు, ఆడపడుచు, భర్తతో సహా అత్తింటివారందరూ ఆమెను కట్నం కోసం వేధింపులకు గురి చేస్తారు. అయితే అందరు ఇలానే ఉంటారు అనుకుంటే పొరపాటే. కొడలిని, కూతురుతో సమానంగా చూసే అత్తింటివారుంటారు. కోడలి నుంచి కట్నం ఆశించడం కాదు.. కన్నవాళ్లని విడిచిపెట్టి.. తమకోసం వచ్చిన కోడలికి.. బదులుగా బహుమతులు ఇచ్చే వారు కూడా ఉంటారు. ఇందుకు నిదర్శనంగా నిలిచే వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోంది.

ఈ సంఘటన మన తెలుగు రాష్ట్రాల్లోనే చోటు చేసుకుంది. అయితే ఎక్కడ అనే వివరాలు మాత్ర లేవు. ఇక వివాహం చేసుకుని.. తమ ఇంట్లోకి అడుగుపెడుతున్న కొత్త కోడలికి జీవితాంతం గుర్తుండిపోయే రీతిలో అద్భుతంగా స్వాగతం పలికారు ఈ అ‍త్తింటివారు. మేళతాళాలతో నూతన దంపతులను ఇంట్లోకి ఆహ్వానించారు. ఆ తర్వాత ఇంట్లోకి అడుగుపెడుతున్న కోడలికి మెట్టుకొక బహుమతిచ్చారు. ఇక పెద్ద మెట్టు మీద ఏకంగా 50 వేల రూపాయల నగదు ఇచ్చారు. ఈ ఆత్మీయ ఆహ్వానానికి సదరు పెళ్లి కుమార్తె భావోద్వేగానికి గురైంది. 

ఇక ఈ వీడియో చూసిన నెటిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో నిజమా కాదా తెలియదు కానీ ఇంత మంచి అత్తింటివారు దొరికిన ఆ అమ్మాయి అదృష్టవంతురాలు.. అందరు మీలానే ఆలోచిస్తే.. ఇక ఈ లోకంలో ఆడపిల్లలను వద్దునుకునే తల్లిదండ్రులే ఉండరు అని ప్రశంసిస్తున్నారు. 

Read latest Social Media News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top