సిద్దిపేటకమాన్: జిల్లాలో అర్హులైన పిల్లలు, గర్భిణీలకు వందశాతం వ్యాధి నిరోధక టీకాలు వేయాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ ధనరాజ్ తెలిపారు. సిద్దిపేట అంబేడ్కర్ నగర్ అర్బన్ హెల్త్ సెంటర్‌ను డీఎంహెచ్‌ఓ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వ్యాధి నిరోధక టీకాల పంపిణీ కార్యక్రమాన్ని టీకాల వివరాల రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..జిల్లాలో ఈనెల 23 నుంచి 31 వరకు ప్రత్యేక వ్యాధి నిరోధక టీకాల పంపిణీ నిర్వహించనున్నామన్నారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని పిల్లలకు అవసరమైన వ్యాధి నిరోధక టీకాలు వేయనున్నట్లు తెలిపారు. జిల్లాలో అమలుచేస్తున్న అన్ని ఆరోగ్య కార్యక్రమాల్లో వంద శాతం లక్ష్యాలను సాధించేలా సిబ్బంది సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. హెల్త్ సెంటర్‌లో ఓపీ, ఐపీ సేవలను పెంచడంతోపాటు, ఎన్‌సీడీ స్క్రీనింగ్, రక్తనమూనాల సేకరణ, ఇతర ఆరోగ్య పరీక్షలను విస్తృతంగా నిర్వహించాలన్నారు. అన్ని రకాల మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ శ్రీకాంత్‌యాదవ్, డాక్టర్ హర్షిణి, ఏఎన్‌ఎంలు సరిత, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
డీఎంహెచ్‌ఓ డాక్టర్ ధనరాజ్


