వర్గల్(గజ్వేల్): నాచగిరి లక్ష్మీనృసింహక్షేత్రాన్ని ఆదివారం సిద్దిపేట పోలీస్‌కమిషనర్ రష్మీపెరుమాళ్ సందర్శించారు. అర్చకులు ఆలయ మర్యాదలతో సాదర స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని అర్చన జరిపించారు. శ్రీవారి ఆశీస్సులు పొందారు. అర్చకులు మహదాశీర్వచనం చేసి, తీర్థప్రసాదాలు అందజేశారు. ఆమె వెంట ఏసీపీ నర్సింహులు, రూరల్ సీఐ రవిరాజు, గౌరారం ఎస్‌ఐ ఆరోగ్యం ఉన్నారు.
నాచారం అవుట్‌పోస్టు తనిఖీ
నాచగిరి క్షేత్రంలో శాంతి భద్రతల పరిరక్షణ, అసాంఘిక శక్తుల కట్టడి ధ్యేయంగా ఏర్పాటైన నాచారం పోలీసు అవుట్‌పోస్టును సీపీ తనిఖీచేశారు. సిబ్బంది పనితీరు, విధుల నిర్వహణను పరిశీలించారు. క్రైమ్‌తీరు, క్షేత్రానికి భక్తుల ఫ్లోటింగ్ తదితర వివరాలను ఏసీపీ, సీఐలతో వాకబుచేశారు. ప్రజలకు నిరంతరం పోలీస్ సేవలు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.
చివరికి పశువులకు మేతగా..
అక్కన్నపేట(హుస్నాబాద్): కోటి ఆశలతో సాగు చేసిన వరి పంట ఎండిపోతోంది. కుందనవానిపల్లిలో మోసర్ల తిరుపతిరెడ్డికి చెందిన రెండెకరాల వరి పంట పూర్తిగా ఎండిపోయింది. దీంతో పశువులకు మేతగా వదిలేశారు. గ్రామ శివారులోని సేవ్యనాయక్‌తండా సమీపంలో 20మంది రైతులు సైతం పంటలు ఎండిపోవడంతో చేసేదిలేక పశువులను మేపుతున్నారు. బోరుబావుల్లో నీళ్లు ఉన్నప్పటికీ కరెంట్ కోతలు...లోఓల్టేజీతో ట్రాన్స్‌ఫార్మర్లు, మోటా ర్లు కాలిపోతున్నాయని వారు వాపోతున్నారు.
కొల్చారం(నర్సాపూర్): విద్యుత్ సమస్యలతో రైతుల పంటలు ఎండిపోకుండా తక్షణ చర్యలు చేపడుతున్నామని విద్యుత్ శాఖ ఎస్‌ఈ నారాయణ నాయక్ తెలిపారు. ఆదివారం మండలంలో ఆయన పర్యటించారు. చిన్నఘనాపూర్ 33/11కేవీ సబ్‌స్టేషన్‌ను సందర్శించి క్షేత్రస్థాయిలో సిబ్బందితో కలిసి తనిఖీ చేశారు. వ్యవసాయానికి విద్యుత్ సరఫరా పరిస్థితులను అంచనా వేసేందుకు వరి గుంతం క్రిటికల్ ఫీడర్‌లోని ట్రాన్స్‌ఫార్మర్, బోర్‌వెల్ స్టార్టర్ పాయింట్ల వద్ద ఓల్టేజీలు తనిఖీ చేశారు. ఈసందర్భంగా రైతులతో మాట్లాడి విద్యుత్ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతుల బోర్లు వాటి సామర్థ్యంపై ఆరా తీశారు. వ్యవసాయానికి నిరంతరాయంగా, నాణ్యమైన విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు చేపట్టాలని క్షేత్ర సిబ్బందిని ఆదేశించారు. ఆయన వెంట ఏఈలు, లైన్‌మెన్‌లు ఉన్నారు.
మెదక్ కలెక్టరేట్: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడమే మా ధ్యేయమని మన్సిపల్ చైర్‌పర్సన్ రాధిక, టీడబ్ల్యూయూ రీజియన్ ఇన్‌చార్జి ఎంఆర్‌రావు అన్నారు. ఆదివారం మెదక్ డిపో ఎదుట సంబురాలు నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉమ్మడి మెదక్ జిల్లా ఆర్టీసీ డిపోలలో కాంగ్రెస్ బలపరిచిన తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్‌కు గుర్తింపు లభించడం హర్షనీయమన్నారు. ఈనెల 17న శనివారం సాయంత్రం వెలువడిన గుర్తింపు ఎన్నికల ఫలితాల్లో 8 డిపోలలో ఆరింటిలో విజయం సాధించి గుర్తింపును దక్కించుకుందన్నారు. కాంగ్రెస్ ఎల్లప్పుడూ కార్మికుల పక్షాన నిలబడుతుందని తెలిపారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కార్యదర్శి శాఖయ్య, డిపో ఆర్టీసీ గౌరవ అధ్యక్షుడు గంగాధర్, శ్రీనివాస్‌రెడ్డి, సుబ్బారావు, సిబ్బంది పాల్గొన్నారు.
నారాయణఖేడ్: కార్మికులకు వ్యతిరేకంగా ఉన్న లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్య నిర్వాహక కమిటీ సభ్యుడు అతిమెల మాణిక్ డిమాండ్ చేశారు. పట్టణంలోని సీఐటీయూ కార్యాలయంలో ఆదివారం సంఘం డివిజన్ స్థాయి సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని ఆరోపించారు. 29 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్‌లను తెచ్చి కార్మికులకు నష్టం చేసిందన్నారు. స్కీం వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, కనీస వేతనంగా రూ.42 వేలు చెల్లించాలన్నారు. ఆయా డిమాండ్లతో ఈనెల 25, 26 తేదీల్లో హైదరాబాద్‌లో మహాధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు.


