గజ్వేల్: సమగ్ర సస్యరక్షణచర్యలతో పంటలను కాపాడుకోవచ్చునని జిల్లా వ్యవసాయాధికారి స్వరూపరాణి పేర్కొన్నారు. శనివారం గజ్వేల్ మండలం పిడిచెడ్ గ్రామంలో విద్యుత్ సరఫరా సక్రమంగా అందక పంటలు ఎండిపోతున్నాయని తెలుసుకొని క్షేత్రస్థాయి పరిశీలన జరిపారు. ఈ సందర్భంగా విద్యుత్ సరఫరా తీరుపై ఏఈ, ఏడీఈలతో మాట్లాడారు. రైతుల పంటలు ఎండిపోకుండా సరఫరా పెంచాలని కోరగా...అధికారులు సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు. కాగా వరిలో కాండం తొలిచే పురుగు సోకిందని గుర్తించారు. నివారణకు సంబంధించి రైతులకు సలహాలు, సూచనలు అందించారు. అదేవిధంగా పత్తి బెట్ట పరిస్థితులను తట్టుకునే చర్యలను కూడా వివరించారు. రైతులు తమ పంటలను క్రమతప్పకుండా పరిశీలిస్తూ, చీడపీడలను బెట్ట పరిస్థితులను ప్రారంభ దశలోనే గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో గజ్వేల్ ఏడీఏ బాబునాయక్, పిడిచెడ్ సర్పంచ్ అశోక్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


