● హుస్నాబాద్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం ● మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్: ఎల్‌నినో ప్రకృతి వైపరీత్యమేనని ఇదేదో కాంగ్రెస్ తెచ్చిన కరువు కాదని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. పట్టణంలోని ఎల్లమ్మ చెరువు సుందరీకరణ పనులు, బతుకమ్మ పండుగ ఏర్పాట్లు, మైసమ్మ ఆలయ పనులను మంత్రి శనివారం పరిశీలించారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..ప్రస్తుత వాతావరణ నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పంట పూర్తయ్యే వరకు రాత్రి వేళల్లో కూడా విద్యుత్ సరఫరా అందించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనల మేరకు రైతులు పంటలు సాగు చేయాలని, ఈ సీజనల్లో వరి సాగును వాయిదా వేసే అంశాన్ని పరిశీలించాలని రైతులను కోరారు. హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు, గ్లాస్ బ్రిడ్జి, కప్పగుట్టను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. బతుకమ్మ ఘాట్ మెట్ల వద్ద మాత్రమే కాకుండా చెరువు వైపు ఇతర ప్రాంతాల్లో అవసరమైన బారికేడ్లు, లైటింగ్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. త్వరలో హుస్నాబాద్‌కు స్విమ్మింగ్ పూల్ జీవో వస్తుందన్నారు. అక్కన్నపేట, ఎల్కతుర్తి మండలాలకు తహసీల్దార్ కార్యాలయాలు మంజూరయ్యాయని, పబ్లిక్ స్కూల్ కోసం ప్రతిపాదన పంపించామని తెలిపారు. గుడిసెలకు మొదటి ప్రాధాన్యతనిస్తూ నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామన్నారు. హుస్నాబాద్‌లో ఎక్కడ భూమి కబ్జా అయినా ఊరుకునేది లేదని, ప్రభుత్వ భూములు కాపాడే బాధ్యత మాది అని అన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టుకు సంబంధించి కాలువల భూ సేకరణ పనులు వేగంగా జరుగుతున్నాయని, భూ సేకరణ తర్వాత కాలువ పనులు ప్రారంభిస్తామని తెలిపారు. కార్యక్రమంలో సీపీ రష్మీపెరుమాళ్, మున్సిపల్ చైర్పర్సన్ దండి లక్ష్మి, వైస్ చైర్పర్సన్ చిత్తారి పద్మ, ఆర్డీఓ రామ్మూర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, మాజీ ఎంపీపీ ఆకుల వెంకట్, మాజీ గ్రంథాలయ సంస్ధ చైర్మన్ కేడం లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు.


