సిరుల తల్లి..ఐశ్వర్యప్రదాయిని
వైభవంగా దేవీశరన్నవరాత్రోత్సవాలు
వర్గల్(గజ్వేల్): సుప్రసిద్ధ వర్గల్ శ్రీ విద్యాసరస్వతి క్షేత్రంలో శరన్నవరాత్రోత్సవాలు ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతున్నాయి. ఉత్సవాల ఏడోరోజు శనివారం సరస్వతి అమ్మవారు ఐశ్వర్య ప్రదాయిని శ్రీమహాలక్ష్మిదేవిగా దివ్యదర్శనమిచ్చారు. ఉదయం బ్రహ్మశ్రీ చంద్రశేఖరశర్మ సిద్ధాంతి నేతృత్వంలో మూలవిరాట్టుకు పంచామృతాలతో మహాభిషేకం నిర్వహించారు. పట్టువస్త్రాలు, సకల ఆభరణాలు, పూలమాలలతో అమ్మవారిని శ్రీమహాలక్ష్మిదేవిగా అలంకరించారు. చతుషష్ట్యుపచార, రాజోపచార పూజలు, చండీహవనం నిర్వహించారు. సప్తశతి పారాయణం చేశారు. వివిధ ప్రాంతాల భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. క్షేత్రంలో 400 వరకు చిన్నారుల అక్షరాభ్యాసాలు జరిగాయి.


