గజ్వేల్రూరల్: పరిశ్రమల్లో పనిచేసే ప్రతీ కార్మికుడికి బోనస్ ఇవ్వాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లిఖార్జున్ డిమాండ్ చేశారు. శుక్రవారం గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజ్ఞాపూర్ శివారులోగల రాణే పరిశ్రమ వద్ద జీవో 6 అమలు చేయాలని కోరుతూ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రోజురోజుకు పెరుగుతున్న ఖర్చులకునుగుణంగా రూ.42వేల కనీస వేతనం అమలు చేయాలన్నారు. జిల్లాలోని గజ్వేల్, కర్కపట్ల, ములుగు, వర్గల్ మండలాల పరిధిలోని కాంట్రాక్టు, క్యాజువల్ కార్మికులతో పనులు చేయించుకుంటూ బోనస్ ఇవ్వడం లేదని ఆరోపించారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 25, 26 తేదీల్లో ఇందిరాపార్కు వద్ద జరిగే ధర్నాకు జిల్లాలోని పరిశ్రమలు, గ్రామపంచాయతీ, మున్సిపల్, అంగన్వాడీ, ఆశ, మధ్యాహ్న భోజన, స్వచ్ఛ, భవన నిర్మాణం, హమాలీ, బీడీ, రవాణ తదితర కార్మికవర్గం తరలిరావాలని పిలుపునిచ్చారు.


