తొగుట(దుబ్బాక): మండలంలో పర్యటించిన మెదక్ ఎంపీ మాదవనేని రఘునందన్రావు ప్రజల సమస్యల పరిష్కారానికి చొరవచూపారు. మండలంలోని బంజేరుపల్లి, చందాపూర్, వర్దరాజుపల్లి గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలు తాము ఎదుర్కుంటున్న సమస్యలు ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన ఎంపీ వెంటనే సంబంధిత జిల్లా అధికారులకు ఫోన్ ద్వారా సమస్యలు వివరించి పరిష్కరించాలని ఆదేశించారు. ఇలా ప్రధాన సమస్యలను అక్కడికక్కడే పరిష్కారానికి చొరవచూపారు. ఇళ్లులేని పేదలకు సుమారు 25ఇందిరమ్మ ఇళ్లు మంజూరుచేయాలని డీఆర్డీఏ పీడీ జయదేవ్ఆర్యాను ఎంపీ ఆదేశించారు. చందాపూర్లో కేంద్ర ప్రభుత్వం ద్వారా వీబీరాంజీ పథకంలో రూ. 30లక్షలతో మీనీ గోదాం నిర్మించుకునేందుకు నిధులు మంజూరు చేస్తానని ప్రకటించారు. పలు సమస్యలు పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవడంతో ఆయా గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తంచేశారు.


