హుస్నాబాద్: గ్రామాల్లో బతుకమ్మ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు, అర్హులైన దివ్యాంగులకు, వృద్ధులకు సహాయ పరికరాలు అందించేందుకు చేపట్టాల్సిన చర్యల పై మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. గురువారం సచివాలయం నుంచి కరీంనగర్, హనుమకొండ, సిద్దిపేట జిల్లాల అధికారులతో మంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ గ్రామాల్లో బతుకమ్మ వేడుకలకు వచ్చే మహిళలు, ప్రజలకు ఎలాంట ఇబ్బందులు పడకుండా సమన్వయంతో సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. ప్రతి గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద బతుకమ్మ ఘాట్ల వద్ద శుభ్రత, మట్టి పనులు, ఇతర ఏర్పాట్లు చేయాలన్నారు. ఏర్పాట్లు విషయంలో ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తితే సంబందిత గ్రామ పంచాయతీ కార్యదర్శులే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో ఏఎల్ఐఎంసీఓ ఆధ్వర్యంలో ఏడీఐపీ పథకం కింద సహాయ పరికరాల పంపిణీ కోసం అర్హులైన వృద్ధులు, దివ్యాంగులను గుర్తించాలన్నారు. గ్రామాల్లో డప్పు చాటింపుల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించి అవగాహన కల్పించాలన్నారు. సిద్దిపేట జిల్లాలో మూడు మండలాలకు రెండు రోజుల పాటు ప్రత్యేక శిబిరాలు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. శిబిరాల నిర్వహణకు ముందుగానే అర్హులైన లబ్ధిదారులను గుర్తించి జాబితా సిద్ధం చేయాలన్నారు. డీఆర్డీఓ, పీడీ, డీడబ్ల్యూఓలతో పాటు జిల్లా, డివిజన్ స్థాయి అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.
మంత్రి పొన్నం ప్రభాకర్
మూడు జిల్లాల అధికారులతో
టెలికాన్ఫరెన్స్


