హుస్నాబాద్: హుస్నాబాద్ పట్టణంలోని జాతీయ రహదారి డివైడర్లపై గుర్తు తెలియని వ్యక్తి టెండర్ లేకుండా, మున్సిపల్ అనుమతి తీసుకోకుండానే గ్లోసన్ బోర్డులు ఏర్పాటు చేశాడు. దాదాపు వందకు పైగా బోర్డులు ఏర్పాటు చేసి, వ్యాపార ప్రకటనలు తీసుకుంటున్నాడు. కనీసం మున్సిపల్‌కు ఒక్క రూపాయి చెల్లించకుండా ఆదాయానికి గండికొడుతున్నారు. దాదాపు ఒక బోర్డుకు నెలకు రూ.3వేల చొప్పున వసూలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. గ్లోసన్ బోర్డులు ఏర్పాటుకు అనుమతి ఇవ్వకూడదని సీడీఎంఏ నుంచి ఆదేశాలు ఉన్నాయి. అయినా బోర్డులు ఏర్పాటు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదు. అనుమతి లేకుండా వ్యాపార ప్రకటనల కోసం బోర్డులు ఎలా ఏర్పాటు చేస్తారని, టెండర్ వేయాలని పలు రాజకీయ పార్టీల నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రజావాణిలో సైతం ఫిర్యాదు చేశారు.
చర్చ లేకుండానే తీర్మానం
గ్లోసన్ బోర్డుల విషయంలో సర్వత్రా విమర్శలు రావడంతో అధికారులు సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారు. గురువారం నిర్వహించిన మున్సిపల్ పాలకవర్గ సమావేశంలో గ్లోసన్ బోర్డుల ఏర్పాటుపై పెద్ద సారు చెప్పారని ఎలాంటి చర్చ లేకుండా రూ.2లక్షల జరిమానా విధిస్తున్నట్లు తీర్మానం చేసి చేతులు దులుపుకున్నారు. దీంతో చర్చించకుండానే సంతకాలు పెట్టి తీర్మానం చేశారు. వచ్చే ఏడాది మార్చి వరకు బోర్డులు ఏర్పాటు చేసిన వ్యక్తికే నిర్వాహణ బాధ్యతలు అప్పగిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేసి సమస్యకు పుల్‌స్టాప్ పెట్టి కొత్త భాష్యానికి తెరలేపారు.
వ్యాపార ప్రకటనల బోర్డు
అనుమతి, టెండర్ లేకుండానే గ్లోసన్ బోర్డులు
మార్చి వరకు అనుమతివ్వాలని తీర్మానం
కొత్త భాష్యం చెబుతున్న అధికారులు, పాలకవర్గం


