● పట్టణంలో ఆకస్మిక తనిఖీలు ● ఆక్రమణల తొలగింపు, జరిమానా
సిద్దిపేటజోన్: నిబంధనలు అతిక్రమించి ఫుట్‌పాత్‌లను ఆక్రమించిన వారిపై బల్దియా అధికారులు కొరడా ఝలిపించారు. మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్‌కుమార్ ఆదేశాల మేరకు శనివారం టౌన్ ప్లానింగ్ అధికారులు, పోలీసు సిబ్బంది సంయుక్తంగా స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. పట్టణంలో పలు ప్రధానదారుల్లో పాదచారులకు ఇబ్బందిగా ఫుట్‌పాత్‌లపై తోపుడు బండ్లు, టిస్టాల్స్, వ్యాపార సంస్థల ఫ్లెక్సీలను అధికారులు తొలగించి హెచ్చరించారు. అలాగే, పట్టణ ప్రాంతాల్లో ప్లాస్టిక్ కవర్లు, ప్లేట్లు, గ్లాసుల విక్రయాల దుకాణాల్లో తనిఖీ చేసి రూ. 5400 జరిమానా విధించారు. పట్టణ పరిధిలోని ఫుట్‌పాత్‌లను వ్యాపారం కోసం ఆక్రమిస్తే చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ హెచ్చరించారు. కేవలం పాదచారుల కోసం ఏర్పాటు చేసిన ఫుట్‌పాత్ మీద ఎలాంటి నిర్మాణాలు ఉండొద్దని, వ్యాపార సంస్థలు తమ సామగ్రిని రోడ్డు పక్కన ఫుట్‌పాత్ మీద పెట్టవద్దని సూచించారు. ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా వ్యాపారం చేసుకోవాలని సూచించారు. అంతకుముందు మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో కమిషనర్ పరిశీలించారు. యూజీడీ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.


