కలెక్టర్ హైమావతి
హుస్నాబాద్: వచ్చే ఖరీఫ్ సీజన్‌లో సన్న రకం వరి సాగుకు రైతులు ముందుకు రావాలని కలెక్టర్ హైమావతి కోరారు. శనివారం హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ గోదాములలో ధాన్యం దిగుమతి ప్రక్రియను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వ్యవసాయ మార్కెట్‌లో 5వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల రెండు గోదాములలో హుస్నాబాద్, అక్కన్నపేట మండలాలకు సంబంధించిన ధాన్యాన్ని దిగుమతి చేస్తున్నామని తెలిపారు. మార్కెట్ యార్డులో పని చేస్తున్న హమాలీలు మిల్లులకు వెళ్లి దిగుమతి చేస్తున్నారని, బయటకు వెళ్లకుండా మార్కెట్‌లోనే పని చేసేలా చర్యలు తీసుకోవాలని మార్కెట్ కమిటీ చైర్మన్‌ను ఆదేశించారు. అలాగే హుస్నాబాద్ నుంచి కొత్తపల్లి వరకు రూ.77.20 కోట్లతో నిర్మిస్తున్న నాలుగు వరుసల రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. ఆర్డీఓ రామ్మూర్తి, ఏసీపీ సదానందం, తహసీల్దార్ లక్ష్మారెడ్డి, విద్యుత్ శాఖ డీఈ క్రిష్ణయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి పాల్గొన్నారు.


