మెదక్‌లో మోడల్‌ ఐక్యరాజ్య సమితి | - | Sakshi
Sakshi News home page

మెదక్‌లో మోడల్‌ ఐక్యరాజ్య సమితి

Mar 1 2026 8:39 AM | Updated on Mar 1 2026 8:39 AM

మెదక్

మెదక్‌లో మోడల్‌ ఐక్యరాజ్య సమితి

మెదక్‌ కలెక్టరేట్‌: జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్‌లో సోషల్‌ ఫోరం సహకారంతో మోడల్‌ ఐక్యరాజ్యసమితి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా అదనపు కలెక్టర్‌ నగేశ్‌, డీఈఓ విజయ, జెడ్పి సీఈవో ఎల్లయ్య హాజరయ్యారు. మెదక్‌ జిల్లాలోని 28 పీఎంశ్రీ పాఠశాలల నుంచి ఇద్దరు విద్యార్థుల చొప్పున 56 దేశాల ప్రతినిధులుగా హాజరై చర్చలో పాల్గొన్నారు. జర్నలిస్టుగా పదిమంది విద్యార్థులు వ్యవహరించారు. సమావేశంలో ప్రసంగించిన విద్యార్థులలో 11 మందిని ఎంపిక చేసి రాష్ట్ర స్థాయికి పంపిస్తామని ఏఎంఓ సుదర్శనమూర్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్‌ అధికారి రాజిరెడ్డి, విద్యాశాఖ అకాడమిక్‌ మానిటరింగ్‌ ఆఫీసర్‌ సుదర్శనమూర్తి, సీఎమ్‌ఓ రాజు, ఏఎస్‌ఓ నవీన్‌, ఎంఈఓలు తదితరులు పాల్గొన్నారు.

అదృశ్యమైన 43 రోజులకు..

మృతదేహం లభ్యం

కొండపాక(గజ్వేల్‌): వ్యక్తి అదృశ్యమైన 43 రోజులకు కుళ్లిపోయిన స్థితిలో అతడి మృతదేహం లభించింది. ఈ ఘటన కుకునూరుపల్లి పోలీస్టేషన్‌ పరిధిలోని లకుడారం గ్రామ శివారులో శనివారం చోటు చేసుకుంది. ఎస్సై శ్రీనివాస్‌ కథనం ప్రకారం... సిద్దిపేట రూరల్‌ మండలంలోని పుల్లూరు గ్రామానికి చెందిన భార్యాభర్తలు దేశెట్టి సరిత, స్వామి 13 ఏళ్ల కింద బతుకుదెరువు కోసం హైదరాబాద్‌లోని బాలానగర్‌కు వెళ్లారు. అక్కడ స్వామి ఆటోను నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో అతడు అనారోగ్యానికి గురవ్వగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదురయ్యాయి. మనస్తాపానికి గురైన అతడు జనవరి 15న ఆటోను నడిపేందుకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి తిరిగి రాలేదు. దీంతో భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం కుకునూరుపల్లి పోలీస్టేషన్‌ నుంచి భార్యకు ఫోన్‌ వచ్చింది. వెళ్లి చూడగా కుడి చేతికి ఉన్న కడెంతో పాటు మెడలో రుద్రాక్షమాల, చెప్పులను చూసి భర్త శవంగా గుర్తించారు.

చెరువులో పడి బాలుడి మృతి

కొల్చారం(నర్సాపూర్‌): తప్పిపోయాడనుకున్న బాలుడు చెరువులో పడి మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలుడి తల్లిదండ్రులు, ఎస్‌ఐ మహమ్మద్‌ మైనొద్దీన్‌ వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన సార వెంకటేశం, శిరీష దంపతులకు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు సతీశ్‌(4) అలియాస్‌ బిట్టు శుక్రవారం మధ్యాహ్నం ఆడుకుంటానని ఇంట్లో నుంచి బయటకు వెళ్లి ఇంటికి రాలేదు. దీంతో తల్లిదండ్రులు వెతికినా ఆచూకీ తెలియకపోవడంతో తప్పిపోయాడనుకున్నారు. ఉదయం సతీశ్‌ గ్రామ శివారులోని సండ్రుకుంటలో తేలి ఉన్నాడని సమాచారం అందించారు. అక్కడికి వెళ్లి చూడగా విగతజీవిగా కనిపించాడు.

కుటుంబ పోషణ భారమై..

వ్యక్తి ఆత్మహత్య

హుస్నాబాద్‌: వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన శనివారం హుస్నాబాద్‌లో చోటు చేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం... పట్టణంలోని బాలాజీ నగర్‌కు చెందిన దుబ్బల సంజు(43)కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో కుటుంబ పోషణ భారంగా మారింది. దీంతో మనస్తాపం చెందిన ఆయన ఇంట్లోనే ఉరి వేసుకున్నాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కూతుళ్ల పెళ్లిళ్లు చేయాలని, ఇందిరమ్మ ఇల్లు కట్టుకోలేని స్థితిలో ఉన్నామని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.

ఆర్థిక ఇబ్బందులతో..

బెజ్జంకి(సిద్దిపేట): వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన శనివారం బెజ్జంకి శివారులోని ఎల్లంపల్లెలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ సౌజన్య, స్థానికుల కథనం మేరకు... గుబిరె రాజయ్య(64, నర్సవ్వ దంపతులకు ఐదుగురు కూతుర్లు కాగా అందరికి వివాహాలు చేశారు. ఇద్దరు దంపతులు బెజ్జంకిలో ఉంటూ వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నారు. సిద్దిపేట, హైదరాబాద్‌లో ఉన్న కూతుర్ల వద్దకు రాజయ్య, నర్సవ్వ వెళ్లారు. శుక్రవారం ఒక్కడే ఇంటికి వచ్చా డు. ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.

హక్కులపై

అవగాహన అవసరం

సిద్దిపేటఅర్బన్‌: రాజ్యాంగం ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించిందని, వాటిపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని టూ టౌన్‌ సీఐ ఉపేందర్‌ సూచించారు. అర్బన్‌ మండల పరిధిలోని మందపల్లి గ్రామంలో శనివారం పౌరహక్కుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులవివక్షకు తావు లేకుండా అందరూ సోదరభావంతో కలిసిమెలిసి ఉండాలన్నారు. జీపీఓ కరుణాకర్‌, పంచాయతీ కార్యదర్శి భవాని పాల్గొన్నారు.

మెదక్‌లో మోడల్‌ ఐక్యరాజ్య సమితి 1
1/1

మెదక్‌లో మోడల్‌ ఐక్యరాజ్య సమితి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement