చెట్టును ఢీకొట్టిన బైక్.. ఒకరి మృతి
సిద్దిపేటఅర్బన్: ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తిని ఆస్పత్రికి తీసుకెళ్తుండగా చెట్టుకు బైక్ ఢీకొని యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాల శివారులో శుక్రవారం రాత్రి జరిగింది. సిద్దిపేట త్రీటౌన్ పోలీసుల కథనం మేరకు... కొండపాక మండలం విశ్వనాథంపల్లికి చెందిన గొడుగు ఆంజనేయులు (23), గణేశ్, నవీన్, ప్రశాంత్ సిద్దిపేటలో సెంట్రింగ్ పని చేస్తున్నారు. వీరితో పనికి వచ్చే సిర్సినగండ్లకు చెందిన కొడిశాల నాగరాజు వ్యవసాయ బావి వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. దీంతో విషయం తెలుసుకున్న ఆంజనేయులు, నవీన్, గణేశ్ ముగ్గురు కలిసి సిర్సినగండ్లకు వెళ్లారు. నాగరాజును నవీన్, ప్రశాంత్ కలిసి బైక్‌పై సిద్దిపేట ఆస్పత్రికి తీసుకెళ్లారు. మరో బైక్‌పై ఆంజనేయులు, గణేశ్, సిర్సినగండ్లకు చెందిన పరమేశ్ కలిసి సిద్దిపేటకు వెళ్తున్నారు. మార్గమధ్యలో పొన్నాల శివారులోని ఆయిల్ మిల్లు వద్ద ఆంజనేయులు నడుపుతున్న బైక్ చెట్టును ఢీకొట్టడంతో ముగ్గురికి బలమైన గాయాలయ్యాయి. వీరిని వెంటనే 108లో సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆంజనేయులు మృతి చెందాడు. గణేశ్‌ను హైదరాబాద్‌కు తరలించగా, పరమేశ్‌ను సిద్దిపేటలోనే ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు.
బైక్ అదుపుతప్పి.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి..
సిద్దిపేటకమాన్: రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన సిద్దిపేట పట్టణ శివారులో చోటు చేసుకుంది. వన్‌టౌన్ సీఐ వాసుదేవరావు వివరాల ప్రకారం... రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన అల్లె ఉపేంద్ర (25) హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తుండగా, నారోజు వెంకటేశ్ ఓ కంపెనీలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. వీరిద్దరూ స్నేహితులు. హైదరాబాద్‌లో విధులు నిర్వహిస్తూ ఒకే గదిలో నివాసం ఉంటున్నారు. ఇద్దరూ స్వగ్రామానికి హైదరాబాద్ నుంచి సిరిసిల్లకు బైక్‌పై శుక్రవారం రాత్రి బయలుదేరారు. ఈ క్రమంలో పట్టణ శివారు ఇమాంబాద్ శివారులో మలుపు వద్ద కల్వర్టు పక్కన ఉన్న గుంతలో ద్విచక్ర వాహనంతో సహా పడిపోయారు. ప్రమాదంలో ఉపేంద్ర అక్కడికక్కడే మృతి చెందగా, వెనకాల కూర్చున్న వెంకటేశ్ తీవ్ర గాయాలతో స్పృహ కోల్పోయాడు. స్పృహలోకి వచ్చిన వెంకటేశ్ తన మిత్రులకు విషయం ఫోన్ ద్వారా తెలుపగా వారు పోలీసులకు తెలిపారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి, వెంకటేశ్‌ను ఆస్పత్రికి తరలించారు.


