స్కౌట్స్‌కు టీచర్లు డుమ్మా
పట్టించుకోని జిల్లా విద్యాశాఖ
జిల్లాలో 43 పాఠశాలలు ఎంపిక
కరీంనగర్‌లో కొనసాగుతున్న శిక్షణ
శిక్షణకు గైర్హాజరవుతున్న ఉపాధ్యాయులు
స్కౌట్స్ అండ్ గైడ్స్‌కు ప్రభుత్వ ఉపాధ్యాయులు మక్కువ చూపడం లేదు. ఎంపికై న ప్రభుత్వ పాఠశాలలలో పని చేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయులను స్కౌట్ మాస్టర్లు, గైడ్ కెప్టెన్లుగా ఎంపిక చేశారు. ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు కరీంనగర్‌లో శిక్షణ ఇస్తున్నారు. శిక్షణకు ఉపాధ్యాయులు గైర్హాజరు అవుతున్నారు. జిల్లా విద్యాశాఖ పట్టించుకోకపోవడంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది.
– సాక్షి, సిద్దిపేట
విద్యార్థుల్లో క్రమశిక్షణ అలవడేందుకు.. దేశభక్తి, జాతీయ భావం పెంపొందించేందుకు స్కౌట్స్ అండ్ గైడ్స్ దోహదపడనుంది. ఇప్పటి వరకు జూనియర్ కళాశాలల్లో మాత్రమే అవకాశం ఉండేది. ప్రభుత్వ పాఠశాలల్లోనూ అమలు చేయాలని నిర్ణయించారు. జిల్లా వ్యాప్తంగా 43 పాఠశాలలు ఎంపిక చేయగా అందులో 23 కేజీబీవీలు, 14 మోడల్ స్కూల్స్, 4 జెడ్పీహెచ్‌ఎస్‌లు, ఒకటి ప్రభుత్వ బాలికల పాఠశాల, ఒకటి టీజీఆర్‌ఈఐఎస్‌లు ఉన్నాయి. వీటిలో విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు 44 గైడ్ కెప్టెన్లు, 19 మంది స్కౌట్ మాస్టర్లను ఎంపిక చేశారు. వీరికి కరీంనగర్‌లో శిక్షణ కొనసాగుతుంది.
యూనిఫాంల కొనుగోళ్లపైనే శ్రద్ధ
మూడు నెలల క్రితం ఆయా పాఠశాలలకు రూ.62వేలను అందించారు. పాఠశాల హెచ్‌ఎంలు ఎంపికై న విద్యార్థుల కోసం స్కౌట్స్ అండ్ గైడ్స్ యూనిఫాంలను కొనుగోలు చేశారు. హైదరాబాద్‌కు చెందిన ఓ ఏజెంట్ ద్వారా కొనుగోలు చేశారు. కొనుగోళ్లలో అక్రమాలు జరిగినట్లు తెలుస్తోంది. హెచ్‌ఎంలకు యూనిపాంల కొనుగోలుపై ఉన్న శ్రద్ధ ఉపాధ్యాయులను శిక్షణకు పంపించేందుకు చూపించకపోవడంతో విమర్శలు వెల్లువెత్తున్నాయి.
సగంమందికి పైగా గైర్హాజరు
జిల్లాకు చెందిన 43 పాఠశాలలో స్కౌట్స్ అండ్ గైడ్స్‌ను అమలు చేసేందుకు 44 గైడ్ టీచర్లు, 19 మంది స్కౌట్స్ మాస్టర్లను ఎంపిక చేశారు. వీరికి కరీంనగర్ జిల్లా ఎల్‌ఎండీ కాలనీలోని ప్రభుత్వ డైట్ కళాశాలలో శిక్షణ ఇస్తున్నారు. ఈ శిక్షణకు సగం మందికిపైగా గైడ్ టీచర్లు, స్కౌట్స్ మాస్టర్లు గైర్హాజరవుతున్నారు. ఈ శిక్షణకు 25 మంది గైడ్ కెప్టెన్లు, 12 మంది స్కౌట్స్ మాస్టర్లు మాత్రమే శిక్షణకు హాజరవుతున్నారు. దీంతో ఉపాధ్యాయులకు స్కౌట్స్ అండ్ గైడ్స్‌పై ఎంత శ్రద్ధ ఉందో అర్థమవుతోంది. ప్రభుత్వం కల్పించిన అవకాశానికి మాస్టర్లు, గైడ్ కెప్టెన్లు హాజరు కాకపోవడంతో విద్యార్థులు శిక్షణకు దూరమయ్యే అవకాశం నెలకొంది.
ఉత్తర్వులు ఇచ్చి..
శిక్షణకు హాజరు కావాలని విద్యాశాఖ ఉత్తర్వులు ఇచ్చి చేతులు దులుపుకొంది. శిక్షణకు ఉపాధ్యాయులు వెళ్తున్నారా?.. లేదా అని జిల్లా విద్యా శాఖ పట్టించుకోవడం లేదని, అందుకే వెళ్లడం లేదని ఉపాధ్యాయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. పలువురు ఉపాధ్యాయులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ శిక్షణకు డుమ్మా కొడుతున్నారు. ఇప్పటికై నా కలెక్టర్ హైమావతి, డీఈఓలు ప్రత్యేక దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. స్కౌట్స్ అండ్ గైడ్స్ శిక్షణకు ఉపాధ్యాయులందరూ హాజరై శిక్షణ పొంది విద్యార్థులకు దేశ భక్తిని, సేవ భావాన్ని పెంపొందించే విధంగా కృషి చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.


