మెనూ ప్రకారమే భోజనం అందించాలి
● కలెక్టర్ హైమావతి ● బాలుర వసతి గృహం ఆకస్మిక తనిఖీ
వసతి గృహంలో వంటలను
పరిశీలిస్తున్న కలెక్టర్
హుస్నాబాద్: విద్యార్థులకు మెనూ ప్రకారం సరిపడా భోజనం అందించాలని కలెక్టర్ హైమావతి అన్నారు. శుక్రవారం పట్టణంలోని వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ బాలుర వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతి గృహంలో మెనూ పాటించకుండా నాణ్యత లేని ఆహారం అందిస్తున్నారంటూ విద్యార్థులు ధర్నా నిర్వహించిన ఘటనపై కారణాలను క్షేత్ర స్థాయిలో ఆరా తీశారు. వంట గదిని పరిశీలించిన కలెక్టర్ ఆహార పదార్థాల నాణ్యతను తనిఖీ చేశారు. కామన్ డైట్ మెనూ ప్రకారమే భోజనం తయారు చేయాలని ఆదేశించారు. వసతి గృహం లోపల, బయట పరిశుభ్రతను పాటించాలన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి విద్యార్థుల స్ధితిగతులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని హాస్టల్ వెల్ఫేర్ అధికారికి సూచించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ధర్నాపై విద్యార్థుల ద్వారా విచారణ చేపట్టి నివేదిక అందించాలని తహసీల్దార్‌ను కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీఓ రామ్మూర్తి, తహసీల్దార్ లక్ష్మారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఎస్సీ, ఎస్టీ కమిషన్ కార్యదర్శిని కలిసిన కలెక్టర్
సిద్దిపేటఅర్బన్: జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ కార్యదర్శి శ్రీనివాస్‌ను కలెక్టర్ హైమావతి మర్యాదపూర్వకంగా కలిశారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి కరీంనగర్ పర్యటనకు వెళ్తుండగా మార్గమధ్యంలోని హరిత హోటల్‌లో ఆగిన కమిషన్ కార్యదర్శిని కలెక్టర్ కలిసి జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల ప్రస్తుత పరిస్థితి, వాటి పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలపై వివరించారు. కార్యక్రమంలో జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ డైరెక్టర్ సునీల్‌కుమార్, జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి అబ్దుల్‌హమీద్ తదితరులు పాల్గొన్నారు.


