
జోరు తగ్గని మంజీరా
పాపన్నపేట(మెదక్): మంజీరా జోరు తగ్గలేదు. సింగూరు నీరు పోటెత్తుతుండటంతో ఘనపురం ఆనకట్ట పొంగి పొర్లుతోంది. దుర్గమ్మ ఆలయాన్ని ముంచెత్తుతూ మంజీరా పరవళ్లు తొక్కుతుంది. మూడో రోజు శనివారం కూడా రాజగోపురంలోనే దుర్గమ్మకు పూజలు నిర్వహించారు. వరుస వర్షాలతో ఎగువ నుంచి సింగూరులోకి 31,400 క్యూసెక్కుల వరద చేరుతుంది. దీంతో ఇరిగేషన్ అధికారులు 43,300 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. జలకళను తిలకించడానికి వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు తరలివస్తున్నారు. ఏడుపాయల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు.