
ఆర్టీసీకి కాసుల గలగల
అదిరిన గి‘రాఖీ’
● రెండు రోజుల్లో రూ.1.98 కోట్ల ఆదాయం ● అధిక సంఖ్యలో ప్రయాణించిన ప్రయాణికులు ● గతేడాదితో పోలిస్తే పెరిగిన రాబడి ● సద్వినియోగం చేసుకున్న ‘మహాలక్ష్మి’లు
సిద్దిపేటకమాన్: రాఖీ పండుగ సందర్భంగా జిల్లాలో ఆర్టీసీకి కాసుల పంట పండింది. సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్–ప్రజ్ఞాపూర్, హుస్నాబాద్ డిపోల పరిధిలో ఆర్టీసీ బస్సుల్లో భారీ సంఖ్యలో ప్రజలు ప్రయాణించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకాన్ని మహిళలు సద్వినియోగం చేసుకున్నారు. వరలక్ష్మీ వ్రతం, రాఖీ పండుగ, ఆదివారం వరుస సెలవులు రావడంతో ఆర్టీసీబస్సులు కిటకిటలాడాయి. దీంతో రెండు రోజుల్లో ఆర్టీసీకి రూ.కోటి 98లక్షల ఆదాయం సమకూరింది. గతేడాదితో పోలిస్తే ఇది అధికం.
నాలుగు డిపోల పరిధిలో రాఖీ పండగ వేళ ప్రయాణికులు ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవడంతో ఆర్టీసీకి భారీగా ఆదాయం సమకూరింది. సిద్దిపేట డిపోలో 53 ఆర్టీసీ, 53అద్దె బస్సులు కలిపి మొత్తం 106 బస్సులు ఉన్నాయి. ఈ బస్సుల ద్వారా 40 ట్రిప్పులు అదనంగా నడపడంతో 1,22,400 మంది ప్రయాణికులు ప్రయాణించారు. దీంతో సిద్దిపేట డిపోకు రెండు రోజుల్లో రూ.81లక్షల ఆదాయం సమకూరింది. వీరిలో 70శాతం మంది మహిళలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. దుబ్బాక డిపోలోని బస్సులు 21వేల కిలోమీటర్లు తిరగడంతో 25వేల మంది ప్రయాణించారు. దీంతో రూ.33లక్షల ఆదాయం సమకూరింది. గజ్వేల్– ప్రజ్ఞాపూర్ డిపోలోని బస్సులు 32వేల కిలోమీటర్లు తిరగాయి. 52వేల మంది ప్రయాణికులు ప్రయాణించారు. దీంతో రూ.61లక్షల ఆదాయం లభించింది. అదేవిదంగా హుస్నాబాద్ డిపోకు సుమారు రూ.23లక్షల ఆదాయం లభించినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. గతేడాది నాలుగు డిపోల పరిధిలో రూ.కోటి ఆదాయం లభిస్తే ఈ ఏడాది రూ.1.98లక్షల ఆదాయం సమకూరినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.
అదనపు చార్జీల వసూలు
రాఖీ పండుగ నేపథ్యంలో ప్రయాణికుల నుంచి ఆర్టీసీ అదనపు చార్జీలు వసూలు చేసింది. సిద్దిపేట నుంచి సికింద్రాబాద్ జేబీఎస్‌కు మాములు రోజుల్లో రూ. 140 చార్జీ చేస్తే పండుగ రోజు రూ.210 వసూలు చేశారు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఆర్టీసీ ఉన్నతాధికారులు, నిబంధనల మేరకు చార్జీ వసూలు చేశామని అధికారులు తెలిపారు.
అదనపు ట్రిప్పులు నడిపాం
రాఖీ పండగ, వరుస సెలవుల నేపథ్యంలో ఆర్టీసీ ద్వారా ప్రయాణించే వారి సంఖ్య పెరిగింది. దీంతో జేబీఎస్, కరీంనగర్, వేములవాడ, ఇతర రూట్లలో అదనపు ట్రిప్పులు నడిపాం. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది అదనపు ఆదాయం సమకూరింది. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళా ప్రయాణికులు అధికంగా ప్రయాణించారు.
– రఘు ఆర్టీసీ డిపో మేనేజర్ సిద్దిపేట

ఆర్టీసీకి కాసుల గలగల