గాడిన పడని గురుకులం! | - | Sakshi
Sakshi News home page

గాడిన పడని గురుకులం!

Nov 2 2026 9:18 AM | Updated on Nov 2 2026 9:18 AM

టీచర్‌ సంగీతను సస్పెండ్‌ చేయాలి

నారాయణఖేడ్‌: స్థానిక మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకులం ఇంకా గాడిన పడటంలేదు. పెద్దశంకరంపేటకు చెందిన ఈ బీసీ గురుకులాన్ని ఖేడ్‌ పట్టణ శివారులోని డిగ్రీ కళాశాల హాస్టల్‌ భవనంలో నిర్వహిస్తున్నారు. అయితే పలు ఆరోపణలు, వివాదాలతో వార్తల్లోకెక్కుతున్న ఈ గురుకులంలో తాజాగా విద్యార్థి ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది.

దండించొద్దని ఉన్నా..

గురుకులంలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థి హర్షిత్‌గౌడ్‌ మొబైల్‌ ఫోన్‌ కలిగి ఉండటాన్ని హిందీ ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వరిస్తున్న సంగీత గుర్తించింది. విద్యార్థి పట్ల దురుసుగా ప్రవర్తించడమే కాకుండా కుటుంబీకులకు చెబుతానంటూ హెచ్చరించడంతో విద్యార్థి ఆందోళన గురయ్యారు. దీంతో ఏం జరుగుతుందోననే భయంతో గురుకులంలోని మరుగుదొడ్డిలో ఉన్న ఫినాయిల్‌ను తాగి అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే గుర్తించిన సిబ్బంది హుటాహుటిన ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయంనుంచి బయటపడ్డాడు. వాస్తవానికి విద్యాహక్కు చట్టం ప్రకారం విద్యార్థులను ఉపాధ్యాయులను దండించడం కానీ, వేధించడం కానీ చేయకూడదు. అయితే గతంలో ఇదే గురుకులంలో సంగీత హాస్టల్‌ వార్డెన్‌గా విధులు

నిర్వర్తించిన సమయంలో విద్యార్థులకు మెనూ ప్రకారం ఆహారం అందించకపోవడం, సరుకులు పక్కదారి పట్టించడం వంటి ఆరోపణలు వచ్చాయి. మెనూ విషయంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ఆమెను వార్డెన్‌ బాధ్యతల నుంచి తొలగించి మరొకరికి అప్పగించారు.

తల్లిదండ్రుల్లో ఆందోళన..

అధ్యాపకులపై నమ్మకంతో గురుకులంలో చేర్చిన తమ పిల్లలకు రక్షణ కరువవడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంటుంది. విద్యార్థి సంఘాల నాయకులు సైతం దండించిన ఉపాధ్యాయురాలిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఘటనపై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నట్లు తెలిసింది.

ఏడాది క్రితం వివాదాలివీ..

ఏడాది క్రితం అప్పట్లో ఉన్న ప్రిన్సిపాల్‌ శ్రీనివాస్‌ తీరుపై విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి తీవ్ర ఆరోపణలు ఎదురయ్యాయి. గురుకులంలో అంటువ్యాధులు ప్రబలినా నాటి ప్రిన్సిపాల్‌ పట్టించుకోకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేసి తమ పిల్లలను ఇళ్లకు తీసుకెళ్లారు. చికిత్సల అనంతరం కొందరు టీసీలు తీసుకుని వెళ్లిపోయారు. ఈ ఘటనపై గురుకులాల రాష్ట్ర అధికారులు విచారణ జరిపి ప్రిన్సిపాల్‌ శ్రీనివాస్‌ను బాధ్యులను చేస్తూ మరో గురుకులానికి అటాచ్‌ చేశారు. అతనిపై శాఖాపరంగా చర్యలు తీసుకొన్నారు. అనంతర కాలంలో ఫుడ్‌ఫాయిజన్‌తో వాంతులు, విరేచనాలతో పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే చికిత్స అందించడంతో విద్యార్థులు కోలుకున్నారు.

విద్యార్థి ఆత్మహత్యాయత్నంతో ఆందోళన

టీచర్‌ బెదిరింపులతోనే అఘాయిత్యం

ఘటనపై ఉన్నతాధికారుల ఆరా

ఆర్సీవో విచారణ

హర్షిత్‌ ఘటనపై విచారణ

విద్యార్థి హర్షిత్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. హిందీ ఉపాధ్యాయురాలు సంగీతపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపించి నివేదికను ఉన్నతాధికారులకు సమర్పిస్తాం. సదరు ఉపాధ్యాయురాలి గురించి విద్యార్థులు కూడా వివరించారు. సమగ్రంగా విచారించి తగు చర్యలు తీసుకుంటాం. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్త పడతాం.

– రాజేశం, రీజినల్‌ కో ఆర్డినేటర్‌, (ఆర్‌సీఓ)

జ్యోతిబాఫూలే గురుకులాల సంస్థ, ఉమ్మడి మెదక్‌ జిల్లా

బీసీ బాలుర గురుకుల విద్యార్థి హర్షిత్‌ ఫినాయిల్‌ తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడేందుకు కారణమైన టీచర్‌ సంగీతను వెంటనే సస్పెండ్‌ చేయాలని బీఎస్పీ ఖేడ్‌ నియోజకవర్గ అధ్యక్షుడు అనుముల తుకారాం డిమాండ్‌ చేశారు. స్థానికంగా ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హర్షిత్‌ను ఆదివారం నాయకులు కాశయ్య, తదితరులతో కలసి పరామర్శించారు. వైద్యులను అడిగి హర్షిత్‌ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలన్నారు. ఆర్సీవో వచ్చి తూతూమంత్రంగా పరిశీలించి వెళ్లిపోతే సమస్యలు పరిష్కారం కావన్నారు. గురుకులాల్లో విద్యార్థుల భద్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement