ఇక పంటనష్టం సర్వే | - | Sakshi
Sakshi News home page

ఇక పంటనష్టం సర్వే

Nov 2 2026 9:18 AM | Updated on Nov 2 2026 9:18 AM

సంగారెడ్డి జోన్‌: ఎల్‌నినో ప్రభావంతో జరిగిన పంట నష్టం వివరాలను సేకరించాలని సంబంధిత అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వర్షాభావ పరిస్థితుల కారణంగా సాగు చేసిన పంటలు ఎదుగుదల లేకపోవడం, ఎండిపోవడంతోపాటు కొన్నిచోట్ల దిగుబడులు తగ్గుముఖం పట్టాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కరువు మండలాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి వివరాలు సేకరించేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది.

పంట నమోదు చేసి

ఉంటేనే..

వ్యవసాయ శాఖ అధికారులు పంట పొలాలను సందర్శించి నష్టం వివరాలు సేకరించనున్నారు. ఆగస్టులో అధికారులు నిర్వహించిన డిజిటల్‌ క్రాప్‌ బుకింగ్‌లో నమోదు చేసి ఉంటేనే నష్ట వివరాలు పరిగణలోకి తీసుకుంటారు. అదేవిధంగా 33%, అంతకుమించి నష్టపోయి ఉంటేనే లెక్కించాలని ప్రభుత్వం ఆదేశాల్లో పేర్కొంది. ప్రతీ పంట పొలాన్ని సందర్శించి, రైతు వివరాలతోపాటు సాగుచేసిన పంట వివరాలు సేకరిస్తారు. ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో పంట సాగు చేశారు? ఎంత మేర పంట దెబ్బతింది? తగ్గిన దిగుబడితోపాటు ఇతర వివరాలు సేకరించి నష్టాన్ని అంచనా వేయనున్నారు. రైతు భరోసా యాప్‌లో పొందుపరిచిన డ్రాఅవుట్‌ వానాకాలం 2026 క్రాప్‌ డామేజ్‌ ఎంట్రీ మాడ్యూల్‌ ద్వారా నిర్వహిస్తారు. జిల్లాలో సాగైన పంటలలో పత్తి, సోయాబీన్‌, కంది, జనములు తదితర పంటలకు నష్టం వాటిల్లింది.

పారదర్శకంగా వివరాలు నమోదు

పంట నష్టం గుర్తింపు పారదర్శకంగా చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గ్రామీణ ప్రాంతాలలో ఉన్న ఏఈవోలు నమోదు చేసిన వివరాలను మండలస్థాయి అధికారులతో పాటు డివిజన్‌, జిల్లా స్థాయి అధికారులు తనిఖీ చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం ప్రకటించిన తీవ్ర కరువు మండలాల్లో స్వయంగా ఉన్నతాధికారులు నష్టాన్ని అంచనా వేయాల్సి ఉంటుంది. మండల అధికారులు 50%, డివిజనల్‌ స్థాయి అధికారులు 25%, జిల్లా అధికారి కనీసం ఐదు శాతం పర్యటించి వివరాలు సేకరించాలని ఆదేశాల్లో పేర్కొంది. గ్రామాల వారీగా నష్టపోయిన వివరాలను సిద్ధం చేయనున్నారు. నష్టపోయిన పంట వివరాలు సంబంధిత గ్రామపంచాయతీలోని నోటీసు బోర్డుపై ప్రచురించాల్సి ఉంటుంది. కలెక్టర్‌ ఆమోదంతో నవంబర్‌ 10 లోపు రాష్ట్ర వ్యవసాయ కమిషనరేట్‌కు పంట నష్ట నివేదికను సమర్పించనున్నారు.

వర్షాభావ పరిస్థితుల కారణంగా ఎదగని పత్తి పంట

క్షేత్రస్థాయిలో పర్యటించనున్న అధికారులు

ఈ నెల 10 లోపు ప్రభుత్వానికి నివేదిక

జిల్లాలోని కరువు మండలాలు 28

సీజన్‌లో లోటు వర్షపాతం 18%

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement