దుబ్బాక: ఆరపల్లి ఉపసర్పంచ్ భర్తపై కల్లు సీసాతో మాజీ సర్పంచ్ దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన శుక్రవారం దుబ్బాక పట్టణంలోని కల్లు దుకాణంలో చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. మండలంలోని ఆరపల్లి గ్రామ ఉప సర్పంచ్ తోట్ల రేణుక భర్త యాదగిరి పట్టణంలో టైలరింగ్ చేస్తుంటాడు. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం షాపులో పని ముగించుకొని కల్లు తాగేందుకు తన స్నేహితుడితో కలిసి వెళ్లాడు. అప్పటికే బాగా మద్యం తాగి ఉన్న ఆరపల్లి మాజీ సర్పంచ్ తోట్ల సత్తయ్య ఒక్కసారిగా కల్లు సీసాతో యాదగిరి తలపై దాడి చేశాడు. అంతటితో ఆగకుండా పగిలిన సీసాతో ముఖం, ఇతర భాగాల్లో విచక్షణ రహితంగా పొడిచి అక్కడి నుంచి పరారయ్యాడు. తల పగిలి తీవ్రంగా రక్తస్రావమై యాదగిరి అక్కడే పడిపోయాడు. దీంతో అక్కడున్న వారు ఆయనను ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ఆయనను సిద్దిపేటలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఈ ఘటనపై బాధితుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.
భూ తగాదాలే కారణమా!
ఆరపల్లి ఉప సర్పంచ్ భర్త తోట్ల యాదగిరి, మాజీ సర్పంచ్ తోట్ల సత్తయ్య మధ్య భూ తగాదాలు ఉన్నాయా? లేక రాజకీయ కక్షలు ఉన్నాయా? అన్న కారణాలు తెలియాల్సి ఉంది. వీరిద్దరూ సొంత పెద్దనాన్న, చిన్ననాన్నల కొడుకులు. సత్తయ్య గతంలో ఆరపల్లి సర్పంచ్గా చేసి సుమారు 15 ఏళ్లుగా దుబ్బాక పట్టణంలోనే ఉంటున్నాడు. మద్యం మత్తులోనే సత్తయ్య పాత కక్షలతో యాదగిరిపై పథకం ప్రకారం కల్లుదుకాణంలో దాడిచేసినట్లు తెలిసింది. ఈ ఘటనతో కల్లుదుకాణంలో ఉన్న వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రస్తుతం దాడికి పాల్పడ్డ సత్తయ్య పోలీసుల అదుపులోనే ఉన్నట్లు సమాచారం.
తలకు తీవ్ర గాయాలు..పరిస్థితి విషమం
దుబ్బాకలోని కల్లు దుకాణంలో ఘటన
డబ్బులివ్వాలని తండ్రిపై కొడుకు..
చిన్నశంకరంపేట(మెదక్): డబ్బులివ్వడం లేదని తండ్రిపై తనయుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన నార్సింగి మండల కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నార్సింగి మండల కేంద్రానికి చెందిన సాయిలు స్థానిక సిమెంట్ దుకాణంలో పనిచేస్తూ భార్యను పోషిస్తున్నాడు. సాయిలు కుమారుడు దానయ్య తన భార్యతో కలిసి మేడ్చల్లో ఉంటున్నాడు. అయితే కుమారుడు శుక్రవారం నార్సింగికి వచ్చి తండ్రిని తబ్బులు అడగడంతో వివాదం మొదలైంది. తన దగ్గర డబ్బులు లేవని తండ్రి చెప్పినా వినకుండా పనిచేయగా వచ్చిన డబ్బులు ఏం చేస్తున్నావని గొడవపడ్డాడు. ఈ క్రమంలో మాటామాట పెరిగి ఆవేశంతో కుమారుడు కత్తితో తండ్రిపై దాడిచేయగా కడుపులో తీవ్రగాయమైంది. గమనించిన ఇరుగు పొరుగు అంబులెన్స్లో రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


