మెదక్ ఎంపీ రఘునందన్‌రావు
మెదక్ కలెక్టరేట్: దివ్యాంగులు ఆత్మగౌరవంతో జీవించాలని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో దివ్యాంగుల సహాయ పరికరాల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా దివ్యాంగుల కోసం ఈ కార్యక్రమం నిర్వహించడం గొప్ప విషయం అన్నారు. మోదీ గత 25 సంవత్సరాల పేద ప్రజలకు ప్రజా సేవ చేస్తున్నారని గుర్తు చేశారు. 6 నెలలుగా 461 మంది దివ్యాంగులను గుర్తించి 850 సహాయ పరికరాలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. దివ్యాంగులు సమాజంలో గౌరవప్రదంగా, స్వయం ఆధారితంగా జీవించేందుకు అవసరమైన సహాయాన్ని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. వారికి అడ్డంకులు లేని, సమగ్ర, సౌకర్యవంతమైన సమాజ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా ఈ శిబిరాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సహాయ పరికరాల పంపిణీ ద్వారా దివ్యాంగులకు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు దోహదపడుతుందని కలెక్టర్ ప్రతిమాసింగ్ పేర్కొన్నారు. అంతకు ముందు కలెక్టరేట్‌తోపాటు మెదక్ జిల్లా కేంద్రంలోని రాందాస్ చౌరస్తాలో జరిగిన విశ్వకర్మ జయంతి ఉత్సవాల్లో ఎంపీ, కలెక్టర్ పాల్గొన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీఆర్‌ఓ అంబదాస్ రాజేశ్వర్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.


