ఆశలతో చెడు‘గూడు’ | - | Sakshi
Sakshi News home page

ఆశలతో చెడు‘గూడు’

Sep 18 2026 9:30 AM | Updated on Sep 18 2026 9:30 AM

ఇందిరమ్మ ఇల్లు మంజూరైన మహిళ మృతి

కుమార్తెకు బిల్లు ఇవ్వడానికి అధికారుల నిరాకరణ

హత్నూర(సంగారెడ్డి): పూరి గుడిసెలో నివసిస్తున్న పేద కుటుంబానికి ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసింది. సంతోషంగా నిర్మాణ పనులు ప్రారంభించిన వారి ఆనందం ఎంతోకాలం నిలవలేదు. ఇల్లు పూర్తి కాకుండానే ఇంటి పెద్ద దిక్కు అకాల మరణం చెందారు. వారసురాలికి ఇల్లు మంజూరు చేయడానికి అధికారులు నిరాకరిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. హత్నూర మండలంలోని నస్తీపూర్‌కు చెందిన చాకలి ఎల్లమ్మది నిరుపేద కుటుంబం. భర్త నారాయణ గతంలోనే మృతిచెందగా, పూరి గుడిసెలో నివసిస్తున్నారు. ఈమెకు గుంట భూమి కూడా లేదు. గతేడాది జూన్‌లో ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసింది. దీంతో గుడిసెను తొలగించి అదే స్థలంలో గ్రామ పెద్దల సమక్షంలో ఇంటి నిర్మాణం కోసం ముగ్గు పోసుకున్నారు. వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించారు. ఇల్లు బేస్‌మెంట్‌ లెవల్‌ వరకు చేరుకోగానే దురదృష్టవశాత్తు ఎల్లమ్మ మరణించింది. దీంతో ఆమె వారసురాలు సువర్ణ (భర్త రమేశ్‌) పేరు మీదకు మార్చాలని అధికారుల చుట్టూ తిరిగారు. రేపు, మాపు అంటూ కాలయాపన చేశారు. గతేడాది అక్టోబర్‌లో కలెక్టరేట్‌ ప్రజావాణిలో సైతం వినతి అందించారు. అయినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈక్రమంలో కొత్తగా ఎన్నికై న సర్పంచ్‌ ప్రమీల ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. గ్రామ పంచాయతీతో పాటు ఇందిరమ్మ కమిటీ తీర్మానం కాపీని అందజేయాలని సూచించగా, ఈ ఏడాది మార్చిలో అందజేశారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. ఇటీవల మరోసారి కలెక్టరేట్‌ ప్రజావాణిలో రెండోసారి దరఖాస్తు అంజేశారు. అయినా ఫలితం లేదు. సొంతింటి కల నెరవేరుతుందని అప్పు చేసి ఇంటికి సరిపడా సామగ్రి తెచ్చుకోగా, అది పాడవుతుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెచ్చిన అప్పులకు వడ్డీ కట్టలేకపోతున్నామని వాపోతున్నారు. ప్రస్తుతం కిరాయి ఇంట్లో నివసిస్తున్నామని, ఇప్పటికై నా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement