ఆలు సాగుకు సన్నద్ధం | - | Sakshi
Sakshi News home page

ఆలు సాగుకు సన్నద్ధం

Sep 18 2026 9:30 AM | Updated on Sep 18 2026 9:30 AM

జహీరాబాద్‌: ఈ ఏడాది వర్షాలు సరిగా లేకపోవడంతో రైతులు ముందస్తు ఆలుగడ్డ సాగుకు ఆసక్తి చూపుతున్నారు. జహీరాబాద్‌ ప్రాంతంలో వారం రోజుల నుంచి విత్తనం వేసే పనుల్లో నిమగ్నమయ్యారు. దళారులు యూపీలోని ఆగ్రా నుంచి లారీల్లో ఆలుగడ్డ విత్తనం తెప్పించి అమ్మకాలు జరుపుతున్నారు. అక్కడ విత్తనాన్ని క్వింటాల్‌కు రూ.1,000కి కొనుగోలు చేసుకుని వస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. ఒక్కో బస్తాకు రూ.300 ట్రాన్స్‌పోర్టు పోగా, మరో రూ. 200 కమీషన్‌ తీసుకుని క్వింటాల్‌ విత్తనాన్ని రూ.2 వేల వంతున విక్రయాలు జరుపుతున్నట్లు తెలిసింది.

ముందస్తు సాగుతో ధర!

గతేడాది ధర తక్కువగా ఉండడంతో రైతులు ఆలుగడ్డ పంట సాగుపట్ల ఆసక్తి చూపుతున్నారు. పంటను ముందస్తుగా సాగు చేయడం వల్ల మార్కెట్‌కు ఉత్పత్తులు అంతంత మాత్రంగానే వస్తాయని, దీంతో గిట్టుబాటు ధర లభించి గట్టెక్కుతామనే ఆశతో రైతులు పంట సాగుకు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం సాగు చేస్తున్న పంట నవంబర్‌లో చేతికి వస్తుంది. డిసెంబర్‌ నుంచి ఆగ్రాలో చేతికి అందివచ్చిన పంట హైదరాబాద్‌ మార్కెట్‌కు వస్తుంది. దీంతో మార్కెట్లో ధరలు పడిపోతాయి. అక్కడి పంట మార్కెట్‌కు రాక ముందే పంటను తీసుకోవాలనే ఆతృత రైతులను ముందస్తు సాగు వైపు ఆడుగులు వేయిస్తోంది. స్వల్పకాలిక పంట కావడం కూడా ఒక కారణం. 70 రోజుల్లోనే పంట చేతికి అందివస్తుంది. జిల్లాలోనే జహీరాబాద్‌ ప్రాంతంలో ఆలుగడ్డ పంటను ప్రతి ఏటా విస్తారంగా సాగు చేస్తూ వస్తున్నారు. సుమారు 3 వేల ఎకరాల్లో పంట సాగవుతోంది.

వర్షాలు లేకపోవడంతో విత్తనం వేస్తున్న రైతాంగం

గతేడాది మార్కెట్లో ధర లేక తీవ్ర నష్టం

అయినా పంటపై చావని మక్కువ

ఆగ్రాలో అత్యధికంగా పంట నిల్వలు

గత రెండేళ్లుగా ఆలుగడ్డ పంటను సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టాలను చవి చూశారు. ఒక్కో ఎకరం పంట సాగుపై రూ.20 వేలకు పైగా నష్టపోయారు. మార్కెట్లో ధర లభించకపోవడమే ఇందుకు కారణం. గతేడాది క్వింటాల్‌ విత్తనం ధర రూ.4 వేలకు కొనుగోలు చేశారు. ఈ ఏడాది మాత్రం సగానికి సగం ధర తగ్గింది. ఆగ్రా ప్రాంతాల్లో అత్యధికంగా పంట నిల్వలు ఉండడమే ఇందుకు కారణంగా రైతులు పేర్కొంటున్నారు. విత్తనం ధర తక్కువ ఉండడం కూడా రైతులు ముందస్తు సాగుకు మొగ్గుచూపుతున్నారు.

అక్టోబర్‌లో సాగు మేలు

ఆలుగడ్డ పంట అక్టోబర్‌ మొదటి వారంలో వేసుకుంటే సానుకూలంగా ఉంటుంది. ప్రస్తుతం ఎండలు 30 డిగ్రీలకు పైగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సాగు అనుకూలం కాదు. సెప్టెంబర్‌లో సైతం రైతులు ఏటా పంట వేసుకుంటూ వస్తున్నారు. కానీ ప్రస్తుతం వాతావరణం అనుకూలంగా లేదు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావం నెలకొంది. ఇది పంట దిగుబడులపై ప్రభావం చూపుతుంది. – సోమేశ్వరావు, జిల్లా ఉద్యాన అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement