హత్నూర(సంగారెడ్డి): ఈనెల 25 తేదీన ‘సాక్షి’లో ప్రచురితమైన ‘ఖబ్రస్తాన్ భూమి కబ్జా’ కథనానికి రెవెన్యూ అధికారులు స్పందించారు. సోమవారం హత్నూర మండలం షేర్‌ఖాన్‌పల్లి గ్రామ శివారులోని కబ్జాకు గురైన స్థలాన్ని ఆర్‌ఐ హరిబాబు పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గత కొన్ని సంవత్సరాల నుంచి కబ్జాలోనే ఉన్నామని సదరు వ్యక్తి చెప్పినట్లు ఆర్‌ఐ పేర్కొన్నారు. వెంటనే తహసీల్దార్‌ను కలిసి కబ్జా విషయాన్ని తెలిపాలని, లేని పక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
సంగారెడ్డి జోన్: చేయూత పెన్షన్ల దరఖాస్తు గడువు ఈనెల 15 వరకు గడువు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సోమవారమే గడువు ముగియాల్సి ఉండగా, గ్రామాల్లో అర్హులై ఉన్నప్పటికీ సరైన సర్టిఫికెట్లు లేకపోవడం, ఇంకా దరఖాస్తు చేసుకోకపోవడం వంటి విజ్ఞప్తులు రావడంతో మరో 15 రోజుల పాటు అవకాశం కల్పించారు. ఇప్పటికే ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా సుమారు 35 వేల వరకు దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు అప్‌లోడ్ చేస్తున్న క్రమంలో సర్వర్ ఇబ్బందులు తలెత్తుతున్నట్లు తెలిసింది.
నారాయణఖేడ్: వసతిగృహాల్లో ఉండి చదువుకుంటున్న విద్యార్థులకు నాణ్యమైన భోజనం, మౌలిక వసతులు కల్పించాలని ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. ఖేడ్‌లోని క్యాంపు కార్యాలయంలో సోమవారం డివిజన్ స్థాయి హాస్టల్ వెల్ఫేర్ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభు త్వం విద్యార్థుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతుందని అన్నారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో రెండో దశ సర్ ప్రక్రియపై బీఎల్‌ఏలకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. పోలింగ్ బూత్‌ల వారీగా ఓటర్ల జాబితాలను పరిశీలించి నమోదు కాని వారి వివరాలు, నోటీసులు అందుకున్న వారి వివరాలు తెలుసుకొని జాబితాల్లో చేర్పించే విధంగా సహకరించాలని అన్నారు. ప్రతీ బూత్ పరిధిలో ఓటర్ల జాబితాను పరిశీలించి అర్హులైన వారి పేర్లు ఖచ్చితంగా జాబితాలో చేర్పించే విధంగా కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ వినోద్ పాటిల్, మున్సిపల్ వైస్ చైర్మన్ దారం శంకర్, పండరిరెడ్డి, తాహెర్ అలీ, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, మున్సిపల్ కౌన్సిలర్లు, బీఎల్‌ఏలు పాల్గొన్నారు.
మెదక్‌జోన్: సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలనే ప్రధాన డిమాండ్‌తో పీఆర్‌టీయూ ఆధ్వర్యంలో చేపట్టిన నేటి మహాధర్నాకు ఉపాధ్యాయులు పెద్దసంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని సంఘం జిల్లా అధ్యక్షుడు సతీశ్‌రావు కోరారు. సోమవారం పట్టణంలోని కార్యాలయంలో యూనియన్ నేతలతో కలిసి మాట్లాడారు. ఎన్నికల సమయంలో సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చి న హామీలు అమలు చేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న పీఆర్‌సీని వెంటనే అమలు చేయాలన్నారు. సమావేశంలో యూనియన్ నేతలు సౌమ్యానాయక్, తదితరులు ఉన్నారు.
నర్సాపూర్: బీజేపీ ఆధ్వర్యంలో ఈనెల 2వ తేదీన 22–ఏ భూ సమస్యలపై నర్సాపూర్‌లో నిరసన దీక్ష చేపట్టాలని నిర్ణయించామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్‌గౌడ్ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. నిరసన దీక్షకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, మెదక్ ఎంపీ రఘునందన్‌రావు హాజరవుతారని చెప్పారు.


