పకడ్బందీగా నిర్వహిస్తాం
చదువుతో పాటు విద్యార్థులకు ఎంతో ఇష్టమైన క్రీడా పోటీలను ప్రభుత్వం ఏటా నిర్వహిస్తుంది. అందులో భాగంగా మంగళవారం నుంచి క్రీడా సంబురాలు ప్రారంభం కానున్నాయి. అండర్ 14, 17 విభాగంలో మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో ఎస్‌జీఎఫ్ (స్కూల్ గేమ్స్ ఫెడరేషన్) క్రీడలు నిర్వహించనున్నారు. ముందుగా మండల స్థాయి క్రీడా పోటీలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఎంఈఓలు ఏర్పాట్లు చేశారు.
– న్యాల్‌కల్(జహీరాబాద్)
జిల్లాలో అన్ని ప్రభుత్వ పాఠశాలలు కలిపి 1,919 ఉండగా, వాటిలో 3,73,613 విద్యార్థులు చదువుతున్నారు. వారు క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఎస్‌జీఎఫ్‌లో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, ఫుట్‌బాల్, కరాటే, బ్యాడ్మింటన్, తైక్వాండో, సాఫ్ట్‌బాల్, బేస్‌బాల్, టేబుల్ టెన్నిస్, అథ్లెటిక్స్, షటిల్, చందరంగం, బాస్కెట్‌బాల్, హ్యాండ్‌బాల్, క్రికెట్, రెజ్లింగ్ తదితర క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. ఈ పోటీల్లో బాలిబాలికలు పాల్గొననున్నారు. అయితే మండలస్థాయిలో ఖోఖో, కబడ్డీ, వాలీబాల్ ఆటలు మాత్రమే నిర్వహిస్తామని, మిగితావి జిల్లా, రాష్ట్రస్థాయిలో నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. ఈనెల 1 నుంచి నుంచి 7 వరకు ఏడు రోజుల పాటు పోటీలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. జిల్లాలో 28 మండలాలుండగా ఒక్కో మండలం నుంచి 1,500 మంది విద్యార్థులు క్రీడా పోటీల్లో పాల్గొననున్నారు. ఇందులో ప్రతిభ కనబర్చిన వారికి ఈనెల రెండో వారంలో జిల్లా స్థాయిలో క్రీడా పోటీలు నిర్వహించునున్నారు. అందులో ప్రతిభ కనబర్చిన వారితో పాటు ఉమ్మడి మెదక్ జిల్లాలోని విద్యార్థులకు జిల్లా స్థాయిలో పోటీలు జరగనున్నాయి. అక్టోబర్‌లో రాష్ట్ర స్థాయిలో క్రీడా పోటీలు నిర్వహించనున్నారు.
నేటి నుంచి మండల స్థాయి ఎస్‌జీఎఫ్ క్రీడలు
ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
జిల్లాలో ఎస్జీఎఫ్ క్రీడలను పకడ్బందీగా నిర్వహిందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. నేటి నుంచి మండల స్థాయి పోటీలు ప్రారంభం కానున్నాయి. రెండవ వారంలో జిల్లా స్థాయి పోటీలను నిర్వహిస్తాం. తర్వాత రాష్ట్ర స్థాయిలో పోటీలు జరుగుతాయి. – రోహిణి, డీఈఓ


