సూక్ష్మజీవులు, పక్షులను కాపాడుకోవాలి
రైతు
నేస్తాలు..
మిరుదొడ్డి(దుబ్బాక): వ్యవసాయ సాగుబడిలో చీడపీడల బెడద ఎక్కువైతే పంటల దిగుబడి పూర్తిగా తగ్గిపోతుంది. పంటలను ఆశించి నష్టపరిచే పురుగుల బెడద నుంచి పంటను కాపాడుకునే ప్రయత్నంలో ఎడాపెడా రసాయన ఎరువులను వాడటం వల్ల రైతులకు మేలుచేసే మిత్ర పురుగులు, పక్షులు కనుమరుగైపోతున్నాయి. ఇవి పంటలకు కీడుచేసే పురుగులను తిని పంటల దిగుబడిని పెంచడంలో సాయపడతాయి. పంట పొలాలల్లో ఇటువంటి మిత్ర పురుగులు, పక్షులను సంక్షిరక్షిస్తేనే రసాయన ఎరువులను తగ్గించుకోవచ్చు. పర్యావరణ, సమతుల్యాన్ని కాపాడటంలో సహజమైన మిత్రపురుగులు కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే అవన్నీ రైతులకు నేస్తాలు.
మిత్ర పురుగులతోనే అధిక దిగుబడులు
పంటలకు మేలుచేసే అక్షింతల పురుగులు(లేడీబర్డ్ బీటిల్), మిడతలు, తూనీగలు, సాలె పురుగులు, పిచ్చుకలు, కొంగలు, కాకులు, మైనాలు, కొంగలు, కోయిలలు, వానపాములు, కప్పలు, పెంకు పురుగులు, ఆరుద్ర పురుగులు రైతులకు అసలైన నేస్తాలుగా పరిగణిస్తారు. వీటిలో కొన్ని భూసారాన్ని పెంపొందిస్తే, మరికొన్ని పంటలకు నష్టాలను కలిగించే పురుగులను తిని పంటల సంరక్షణలో కీలకపాత్ర పోషిస్తాయి. కానీ రైతులు అధిక దిగుబడులను ఆశించి మోతాదుకు మించిన రసాయన ఎరువులను వినియోగించడం వల్ల మేలుచేసే మిత్రపురుగులు అంతరించిపోతున్నాయని వ్యవసాయ అధికారులు, పర్యావరణ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అవసరం మేరకే సాయన ఎరువులను వినియోగించి మిత్ర పురుగులను కాపాడుకొంటేనే మంచి దిగుబడులు సాధించవచ్చని సూచిస్తున్నారు.
కానరాని పశు సంపద
వ్యవసాయరంగంలో యాంత్రిక విప్లవం రావడంతో కాలక్రమేణా పశుసంపద కానరాకుండా పోయింది. దున్నుకం మొదలుకొని, పంటకోసి విక్రయించే వరకు రైతులు యంత్రాలపైనే ఆధారపడుతున్నారు. ఒకనాడు తొలకరి పలకరింపుతో పశువులతోనే వ్యవసాయం ప్రారంభమయ్యేది. దిగుబడి రాశులను ఎడ్లబళ్లపై ఇళ్లకు చేర్చుకునేవారు. పశువుల ఎరువులతో అధిక దిగుబడి సాధించేవారు. కాలక్రమేణా యాంత్రిక వ్యవసాయానికి అలవాటు పడ్డ రైతులకు పశువుల అవసరం లేకుండా పోయింది. దీంతో పశు సంపద కనుమరుగైంది.
వ్యవసాయంలో మితిమీరిన రసాయన మందుల వినియోగం. ఆవాసాలు దెబ్బతినడం, నగరీకరణ వల్ల రైతులకు మేలుచేసే మిత్ర పురుగులు, పక్షులు వేగంగా కనుమరుగైపోతున్నాయి. పకృతి సమతుల్యతను కాపాడటం, పెట్టుబడిలేని ఉచిత సస్యరక్షణ అందించడం, అధిక దిగుబడులు సాధించడంలో వీటిపాత్ర ఎంతో కీలకం. ఈ రైతు నేస్తాలను కాపాడుకోవడం చాలా అవసరం
పంటలకు మేలు చేస్తున్న రైతు నేస్తాలను తప్పనిసరిగా కాపాడుకోవాలి. వ్యవసాయరంగంలో ముఖ్య భూమిక పోషించే పశుసంపద కనుమరుగవడంతో రైతులు సేంద్రియ ఎరువులకు దూరమయ్యారు. అలాగే రసాయన ఎరువులను విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. అంతేకాక చీడపీడలను వదిలించుకోడానికి రకరకాల పురుగుల మందులను వాడుతుండటంతో రైతు నేస్తాలైన సూక్ష్మజీవులు, పక్షులు, పశువులు కనుమరుగవుతున్నాయి. అనవసర పురుగుల మందుల వినియోగాన్ని తగ్గించి పంటకు మేలుచేసే బదనికలు, పరాన్న జీవులు, పక్షులను కాపాడుకోవాలి.
– ప్రశాంత్ ఏఈఓ, మిరుదొడ్డి


