వేతనాలు ఒకటో తేదీన చెల్లించేలా చూస్తా.. | - | Sakshi
Sakshi News home page

వేతనాలు ఒకటో తేదీన చెల్లించేలా చూస్తా..

Jul 24 2026 7:19 AM | Updated on Jul 24 2026 7:19 AM

హత్నూర(సంగారెడ్డి): మిషన్‌ భగీరథ తాగునీటి పథకంలో పనిచేసే కార్మికులందరికీ ప్రతినెలా ఒకటో తేదీన వేతనాలు చెల్లించే విధంగా ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని అదనపు కలెక్టర్‌ పాండు తెలిపారు. హత్నూర మండలం బోరపట్ల గ్రామ శివారులోని మిషన్‌ భగీరథ పంపుహౌస్‌ను గురువారం ఆయన పరిశీలించారు. కాంట్రాక్ట్‌ కార్మికులతో మాట్లాడి వేతనాలపై ఆరా తీశారు. ఎప్పుడు అందుతున్నాయోనని అడిగి తెలుసుకున్నారు. తమకు ఏడు నెలల నుంచి వేతనాలు రావడం లేదని పంపు లైన్‌మాన్‌లు ఆయన వద్ద వాపోయారు. పంపుహౌస్‌లో పనిచేస్తున్న కొంత మందికి కూడా సక్రమంగా జీతాలు అందడం లేదని ఏకరువు పెట్టారు. దీంతో ఆయన మాట్లాడుతూ ప్రతినెలా ఒకటో తేదీ నాటికి వేతనాలు వచ్చే విధంగా ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లాలో మిషన్‌ భగీరథ పథకంలో 983 మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారని, ప్రభుత్వ ఆదేశాలతోనే కాంటాక్ట్‌ కార్మికులను స్వయంగా కలిసి వారి సమస్యలను తెలుసుకున్నానని చెప్పారు.

ఆరుతడి పంటలే మేలు

ఎల్‌ నినో ప్రభావం వల్ల వచ్చే ఏడాది జూన్‌ వరకు వర్షాలు తక్కువగా కురుస్తాయని శాస్త్రవేత్తలు చెప్తున్న నేపథ్యంలో రైతులు వరికి బదులు ఆరుతడి పంటలవైపు మొగ్గుచూపాలని అదనపు కలెక్టర్‌ పాండు రైతులకు సూచించారు. వర్షపాతం లేకపోతే వరి సాగుచేసే రైతులు నష్టపోయే ప్రమాదం ఉందని చెప్పారు. జలసిరి పథకంలో భాగంగా ఉపాధి హామీ పథకంతో గ్రామాలలో ప్రతి ఇంట్లో ఇంకుడు గుంత, ప్రతి పొలంలో పామ్‌ పాండ్‌, ప్రతి గ్రామంలో ఊరకుంట నిర్మాణాలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ప్రతినీటి బొట్టును ఒడిసి పట్టి కాపాడు కోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు. రైతులు వరి వేస్తే నష్టపోచి ఆర్థికంగా దివాలా తీసే పరిస్థితి ఏర్పడకుండా ఉండాలంటే ఆరుతడి పంటలు వేసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఆర్‌డీఓ బాలరాజ్‌, మిషన్‌ భగీరథ ఈఈ నాగభూషణం, డీఈ భరత్‌, ప్రవీణ్‌, ఏఈలు సురేశ్‌, శివ, మిషన్‌ భగీరథ కార్మికులు పాల్గొన్నారు.

టెన్త్‌లో వందశాతం ఉత్తీర్ణత సాధించాలి

నారాయణఖేడ్‌: టెన్త్‌లో వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా చక్కటి బోధన అందిస్తూ విద్యార్థులను తీర్చిదిద్దాలని అదనపు కలెక్టర్‌ పాండు ఉపాధ్యాయులకు సూచించారు. డీఆర్‌డీఓ బాలరాజుతో కలిసి గురువారం నిజాంపేట్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పదోతరగతి విద్యార్థులతో మాట్లాడారు. బోధన, పాఠ్యాంశాల అవగాహన, విద్యార్థుల అభ్యాసన స్థాయిపై ఆరా తీశారు. పాఠశాలలో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ, మౌలిక సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆహార పదార్థాలను పరిశీలించారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. మండలంలో పారిశుద్ధ్య పనులు, శానిటేషన్‌ నిర్వహణపై ఆధికారులకు సూచనలు చేశారు. కార్యాలయాలు, గ్రామాల్లో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, నాటిన మొక్కలను సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని సూచించారు. ఎంపీడీఓ సంగ్రాం, ఎంపీఓ సురేశ్‌, సర్పంచ్‌ కావ్యరెడ్డి, ఎంపీపీ మాజీ ఉపాధ్యక్షుడు సాయిరెడ్డి, నాయకులు రాధాకృష్ణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మిషన్‌ భగీరథ కాంట్రాక్టు కార్మికుల జీతాలపై ఆరా

అదనపు కలెక్టర్‌ పాండు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement