ఉద్యమకారుల గుర్తింపు కమిటీ చైర్మన్ కోదండరాం
దుబ్బాక: తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి వారికి అన్నివిధాలుగా సముచిత న్యాయం చేస్తామని ఎమ్మెల్సీ, తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ చైర్మన్ కోదండరాం చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న దుబ్బాక నియోజకవర్గంలోని 280 మంది ఉద్యమకారుల ఎఫ్‌ఐఆర్‌లను గురువారం ఆయన అద్దంకి దయాకర్ కమిటీకి అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో దుబ్బాక నియోజకవర్గం పాత్ర కీలకమైనదన్నారు. ఉద్యమంలో పాల్గొన్న ప్రజా సంఘాలు, జర్నలిస్టులు, న్యాయవాదులు, కార్మిక, కర్షకులతోపాటు ఉద్యమకారులకు తప్పకుండా న్యాయం చేస్తామన్నారు. కార్యక్రమంలో జాతీయ మాలమహానాడు ప్రధాన కార్యదర్శి బైరి రమేశ్, రాష్ట్ర పోలిట్‌బ్యూరో చైర్మన్ ర్యాకం శ్రీరాములు, పీఏసీఎస్ వైస్ చైర్మన్, నియోజకవర్గ మాల మహానాడు ఇన్‌చార్జి కాల్వ నరేశ్, రవికాంత్ తదితరులు పాల్గొన్నారు.
ఎస్పీ శ్రీనివాసరావు
మెదక్‌జోన్: కేవలం 22 రోజుల్లో 142 సెల్‌ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అప్పగించామని ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. గురువారం ఆయన తన కార్యాలయంలో బాధితులకు ఫోన్లను అప్పగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మెదక్ జిల్లా వ్యాప్తంగా బాధితులు పోగొట్టుకున్న సెల్‌ఫోన్లను రికవరీ చేశామన్నారు. వాటి విలువ రూ.21.84 లక్షల ఉంటుందని, ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 4,038 ఫోన్ల రికవరీచేసి రాష్ట్రంలో 3వ స్థానంలో నిలిచామని చెప్పారు. మొబైల్ ఫోన్ల రికవరీ కోసం ప్రతి పోలీస్‌స్టేషన్‌లో ప్రత్యేక కానిస్టేబుల్‌ను నియమించామని తెలిపారు. ఫోన్ల రికవరీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బందికి ఆయన ప్రశంసాపత్రాలు అందించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్‌సింగ్, సీఐలు జార్జ్, రాజశేఖర్‌రెడ్డి, ఐటీ కోర్ సిబ్బంది విజయ్, మహేందర్, వెంకట్‌గౌడ్, సీఈఐఆర్ పోర్టల్ సిబ్బంది పాల్గొన్నారు.
సంగారెడ్డిటౌన్: నిందితుల చేతికి వేయాల్సిన బేడీలను గేటుకు వేయడం అందరినీ ఆశ్చర్యంలోకి నెట్టింది. శిక్షపడిన ఖైదీలను తరలించేటప్పుడు వారు పారిపోకుండా పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ జిల్లా కేంద్రంలోని రూరల్‌పోలీస్ స్టేషన్ గేటుకు తాళానికి బదులు బేడీలను ఉపయోగించారు. దీంతో పలు విమర్శలు వచ్చాయి. రూరల్ పోలీసులను వివరణ కోరగా హైదరాబాద్, జహీరాబాద్ ప్రాంతాలకు వెళ్లే ఇతరులు చాలా మంది తమ వాహనాలను పోలీస్ స్టేషన్లో పార్కింగ్ చేస్తున్నారని, దీంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. తాళం పట్టకపోవడంతో ఓ కానిస్టేబుల్ పొరపాటుగా గేటుకు బేడీలు వేశారని, వెంటనే అప్రమత్తమై తొలగించామని చెప్పారు.
నారాయణఖేడ్: కేరళకు చెందిన జాతీయ గ్రామీ ణాభివృద్ధి సంస్థకు చెందిన ప్రతినిధులు స్వయం సహాయక బృందాల పనితీరును పరిశీలించారు. కేరళకు చెందిన చెమ్మగం, సురేశ్‌కుమార్, సంధ్య, జీనా, ఇందులేఖతోపాటు ఎన్‌ఐఆర్డీ బృందం మండలంలోని వెంకటాపూర్‌తండాను సందర్శించింది. తండాలోని రామసీతా స్వయం సహాయక బృందం సభ్యులతో కలిసి మేకలు, కోళ్లు, గొర్రెలు కొనుగోలుచేసి ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నారో తెలుసుకున్నారు. పలు విషయాలను పరిశీలించారు. స్వయం సహాయక బృందాలు ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ ద్వారా చేస్తున్నఽ ధాన్యం సేకరణ, కుసుమ, పల్లి విక్రయాలు, పప్పుధాన్యాలను కొనుగోలు చేసి లాభాలు పొందడంపై ఆరా తీశారు. అనంతరం ఖేడ్ ఐకేపీ కార్యాలయంలో స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులతో సమావేశమయ్యారు. జిల్లా ప్రాజెక్టు మేనేజర్ మల్లేశం, సభ్యులు కిరణ్, ఏపీఎం సాయిలు, రామారావు, రాజు పాల్గొన్నారు.


