పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రుద్రారం గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, గణిత, గణాంక శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని ప్రణవి డాక్టరేట్‌కు అర్హత సాధించారు. ‘టోపోలాజికల్ సూచికలను ఉపయోగించి అణు నిర్మాణాల గణిత నమూనా రూపకల్పన, గ్రాఫ్ సైద్ధాంతిక విధానం’పై ఆమె పూర్తి స్థాయి అధ్యయనం చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు. ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గణిత శాస్త్ర విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ విజయ శేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భందా డాక్టర్ ప్రణవిని గీతం అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీఎస్.రావు, రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్‌ఆర్ వర్మ, సైనన్స్ డైరెక్టర్ డాక్టర్ రెజా, గణిత, గణాంక శాస్త్ర విభాగాధిపతి జాదవ్ గణేశ్, పలు విభాగాల అధిపతులు, అధ్యాపకులు అభినందించారు.
ప్లాస్టిక్ కవర్స్ వినియోగం.. జరిమానా
హుస్నాబాద్‌రూరల్: నిషేధిత ప్లాస్టిక్ కవర్స్ వాడి పర్యావరణానికి హాని కలిగిస్తున్నారని మున్సిపల్ అధికారులు మంగళవారం పలు దుకాణాల యజమానులకు జరిమానా విధించారు. కమిషనర్ మల్లికార్జున్ ఆదేశాల మేరకు పట్టణంలోని బేకరీలు, దుకాణాలను తనిఖీ చేసిన అధికారులు ప్లాస్టిక్ కవర్స్‌ను గుర్తించారు. ఆర్‌ఎస్ పాస్ట్‌ఫుడ్ సెంటర్‌కు రూ.500, మైసూరి బేకరీకి రూ.1500, రాందేవ్ జనరల్ స్టోర్‌కు, హనుమాన్ జనరల్ స్టోర్‌కు, ఎస్‌ఎల్‌వీ బేకరీకి రూ. వెయ్యి చొప్పున జరిమానా విధించినట్లు శానిటరీ ఇన్‌స్పెక్టర్ బాల ఎల్లం తెలిపారు. నిషేధిత ప్లాస్టిక్ కవర్స్‌ను వాడితే చట్ట రీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు.
హద్దురాళ్ల ధ్వంసం..
వ్యక్తిపై కేసు
న్యాల్‌కల్(జహీరాబాద్): హద్దురాళ్లను ధ్వంసం చేసిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. హద్నూర్ ఎస్‌ఐ సుజిత్ కథనం ప్రకారం... నారాయణఖేడ్ మండలం పిప్రి గ్రామానికి చెందిన డాక్టర్ చందులాల్ న్యాల్‌కల్ మండల పరిధిలోని ముంగి గ్రామ శివారులో గల సర్వే నం.137లో 2.34 ఎకరాల భూమిని 2003లో కొనుగోలు చేశాడు. కొనుగోలు చేసిన భూమి చుట్టూ కంచె కోసం హద్దురాళ్లను ఏర్పాటు చేసుకున్నాడు. కాగా పొలం పక్కనే ఉన్న అత్నూర్ గ్రామానికి చెందిన ఖాజామియా హద్దు రాళ్లను ధ్వంసం చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఖాజామియాపై కేసు నమోదు చేశారు.
నాసిరకం పదార్థాల విక్రయం
హోటళ్లపై దాడులు.. జరిమానా
రామాయంపేట(మెదక్): కుళ్లిపోయిన ఆహార పదార్థాలను విక్రయిస్తున్న రెండు హోటళ్లకు అధికారులు జరిమానా విధించారు. మున్సిపల్ కమిషనర్ రవీందర్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ వనిత, తమ సిబ్బందితో కలిసి పట్టణంలోని బ్లూ డైమండ్, నూర్ హోటళ్లలో తనిఖీలు నిర్వహించారు. కాగా కుళ్లిపోయిన ఆహార పదార్థాలు, వంట గది అపరిశుభ్రంగా ఉన్నట్లు తనిఖీల్లో వెలుగుచూశాయి. ఈ మేరకు కుళ్లిన ఆహారపదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. రెండు హోటళ్లకు రూ. 20 వేల చొప్పున జరిమానా విధించినట్లు కమిషనర్ వెల్లడించారు.
గంజాయి కేసులో వ్యక్తికి రూ.10 వేలు..
నర్సాపూర్: గంజాయి కేసులో వ్యక్తికి స్థానిక కోర్టు మంగళవారం జరిమానా విధించింది. స్థానిక ఎకై ్సజ్ సీఐ గులాం ముస్తాఫా కథనం ప్రకారం... మండలంలోని రాంచంద్రాపూర్‌కు చెందిన సాయిబాబ వద్ద గతంలో గంజాయి లభించగా అధికారులు అతనిపై కేసు నమోదు చేశారు. కాగా వాదోపవాదాల అనంతరం నిందితుడికి జడ్జి ఎం.హేమలత రూ.10 వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.


