తాళం వేసి ఉన్న ఇళ్లే టార్గెట్ 106 కేసులున్న దొంగ అరెస్టు 22.5 తులాల బంగారం, 60తులాల వెండి ఆభరణాలు స్వాధీనం వివరాలు వెల్లడించిన ఎస్పీ
సంగారెడ్డి జోన్: హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో వరుసగా దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ పరితోష్ పంకజ్ కేసు వివరాలు వెల్లడించారు. మహబూబ్ నగర్ జిల్లా బోయపల్లి గేట్ ప్రాంతానికి చెందినకోటపల్లి చంద్రి అలియాస్ శేఖర్ కార్ డ్రైవింగ్ చేస్తూ ప్రస్తుతం మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలోని దుండిగల్ మండల పరిధిలోని గాగిల్లాపూర్‌లో నివాసం ఉంటున్నాడు. విలాసవంతంగా బతికేందుకు చోరీ లను ఎంచుకున్నాడు. తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసి పగలు రెక్కీ నిర్వహించి, రాత్రి చోరీ చేస్తున్నాడు. కాగా జిల్లాలో జరిగిన వరుస దొంగతనాల నేపథ్యంలో సీసీఎస్, గుమ్మడిదల పోలీసుల తో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా మంగళవారం బొంతపల్లి కమాన్ పరిసర అదుపు లోకి తీసుకొని విచారించగా, నేరం అంగీకరించా డు. నిందితుడి నుంచి 22.5 తులాల బంగారం, 60 తులాల వెండి ఆభరణాలు, రూ.25 వేలు నగదును స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు. నిందితుడిపై సంగారెడ్డితో పాటు పలు జిల్లాల్లో 106 కేసులు నమోదయ్యాయి. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోక్సో కేసు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కేసు ఛేదనలో కీలకంగా వ్యవహరించిన సీసీఎస్ ఇన్‌స్పెక్టర్‌లు వి.శివకుమార్, చి.ప్రసాద్ రావు, జిన్నారం సర్కిల్ ఇన్‌న్‌స్పెక్టర్ పి.రమణ రెడ్డి, సీసీఎస్ ఎస్‌ఐ కె.శ్రీకాంత్, గుమ్మడిదల ఎస్‌ఐ కె. అరుణ్ కుమార్‌ను అభినందించారు. సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి పాల్గొన్నారు.


