మెదక్‌జోన్: చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని డీఈఓ రాజు పేర్కొన్నారు. 4వ తెలంగాణ స్టేట్ మిడిల్ అండ్ లాంగ్‌డిస్టెన్స్ అథ్లెటిక్ మీట్స్ 2026– జిల్లా స్థాయి అథ్లెటిక్ క్రీడాకారుల ఎంపిక స్థానిక ఇందిరాగాంధీ స్టేడియంలో మంగళవారం నిర్వహించారు. ఈ పోటీల్లో జిల్లా నలుమూలల నుంచి 350 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఇందులో ప్రతిభ కనబర్చిన వారికి జ్ఞాపికలు అందజేశారు. అనంతరం డీఈఓ మాట్లాడుతూ.. క్రీడలు, చదువు రెండు ముఖ్యమేనని, ఉన్నత స్థాయికి చేరుస్తాయన్నారు. క్రీడాకారులకు మంచి భవిష్యత్తు ను అందివ్వడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి రమేశ్ తెలిపారు. ఇందులో భాగంగా ఈ నెల 9న యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రభుత్వం ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటరమణ, కార్యదర్శి మధుసూదన్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి పాల్గొన్నారు.


