అంచనా వ్యయం కంటే సుమారు 4.5% ఎక్కువ..!
గుంతలు పడిన రోడ్డు
హ్యామ్ (హైబ్రీడ్ యాన్యుటీ మోడల్) రోడ్ల నిర్మాణ పనులకు అంచనా వ్యయం కంటే ఎక్కువ (ఎక్సెస్)కు టెండర్లు దాఖలయ్యాయి. ఈ పనులు దక్కించుకుంటున్న కాంట్రాక్టు కంపెనీలు సుమారు 4.5% ఎక్సెస్‌కు బిడ్‌లు దాఖలు చేసినట్లు రోడ్లు భవనాలశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆయా రోడ్ల అంచనా వ్యయం కంటే 5 శాతానికి మించి ఎక్కువ కోట్ చేయడానికి వీలులేకుండా ప్రభుత్వం నిబంధన విధించిన సంగతి తెలిసిందే. ఇలా ఎక్సెస్‌కు టెండర్లు దాఖలు కావడంతో ప్రభుత్వ ఖజానాపై అదనపు భారం పడనుందని అంచనా.
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఈ హ్యామ్ విధానంలో జిల్లాలో మొత్తం 21 రోడ్లను ఎంపిక చేశారు. 318 కిలోమీటర్ల పొడవున్న ఈ రోడ్ల అభివృద్ధి పనులకు రూ.684 కోట్ల అంచనా వ్యయంతో రోడ్లు భవనాల శాఖ టెండర్లు పిలిచింది. ఈ లెక్కన 4.5% ఎక్సెస్‌కు టెండర్లు దాఖలు చేయడంతో సుమారు రూ.30 కోట్లకు పైగా ప్రభుత్వ ఖజానాపై భారం పడనుందని అంచనా. ఎంపిక చేసిన 21 రోడ్లలో ఐదు రోడ్లను రెండు లైన్ల రహదారిగా విస్తరించనున్నారు. మిగిలినవి ప్రస్తుతం ఉన్న రోడ్లను బలోపేతం చేస్తారు.
మూడు ప్యాకేజీలు..
రోడ్లు భవనాలశాఖ ఈ 21 రోడ్లను మూడు ప్యాకేజీలుగా విభజించింది. ఆందోల్, ఖేడ్ నియోజకవర్గాల పరిధిలోని ఏడు రహదారులను మొదటి ప్యాకేజీలో ఎంపిక చేశారు. అలాగే జహీరాబాద్, ఆందోల్ నియోజకవర్గాల్లోని తొమ్మిది రోడ్లను రెండో ప్యాకేజీలో చేర్చారు. ఈ రెండో ప్యాకేజీలో వికారాబాద్ జిల్లా రోడ్లు కూడా ఉన్నాయి. మూడో ప్యాకేజీలో సంగారెడ్డి, పటాన్‌చెరు నియోజకవర్గాల పరిధిలోని రోడ్లు ఉన్నాయి. ఇలా మొత్తం మూడు ప్యాకేజీలుగా మార్చి టెండరు ప్రక్రియను నిర్వహించారు. ఇందులో మొదటి, రెండో ప్యాకేజీలు హైదరాబాద్‌కు చెందిన ఓ కాంట్రాక్టు కంపెనీకి దక్కాయి. మూడో ప్యాకేజీ మరో కాంట్రాక్టు కంపెనీ దక్కించుకుంది. ఈ రెండు కాంట్రాక్టు కంపెనీలు ఎక్సెస్‌కే టెండర్లు దాఖలు చేశారని ఆశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం ఈ పనుల అగ్రిమెంట్లస్థాయిలో టెండరు ప్రక్రియ ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక సర్వే నిర్వహించి పనులు ప్రారంభించే అవకాశాలున్నాయని పేర్కొంటున్నారు.
ఈ హ్యామ్ విధానం కింద ప్రభుత్వం మంజూరు చేసిన రోడ్ల సంఖ్య, మంజూరైన నిధుల్లో సంగారెడ్డి జిల్లా రెండో స్థానంలో ఉంది. నల్లగొండ జిల్లా తర్వాత అత్యధికంగా రోడ్లు సంగారెడ్డి జిల్లాలోనే మంజూరయ్యాయి. ఈ రోడ్ల నిర్మాణం పనులు పూర్తయ్యాక నిర్ణీత సంవత్సరాల వరకు ఈ రోడ్ల నిర్వహణ బాధ్యత కాంట్రాక్టు కంపెనీదే. ఈ సమయంలో ఏమైనా మరమ్మతులు చేపట్టాల్సి వచ్చినా ఈ కంపెనీలే పనులు చేస్తాయి. అయితే జిల్లాలో రోడ్ల పరిస్థితి దయనీయంగా తయారయ్యాయి. నిర్వహణ లేకపోవడంతో చాలా రోడ్లు మోకాళ్లలోతులో గుంతలు పడ్డాయి. దీంతో వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ పనులు సకాలంలో పూర్తయితే రోడ్ల కష్టాల నుంచి వాహనదారులకు ఉపశమనం కలిగే అవకాశాలున్నాయి.
ఖజానాపై రూ.30 కోట్లకు మించి
అదనపు భారం
రూ.684 కోట్లతో
21 రోడ్ల అభివృద్ధి పనులు
మూడు ప్యాకేజీలుగా
విభజించిన ఆర్ అండ్ బీ శాఖ


