అదనపు కలెక్టర్ పాండు
సంగారెడ్డి: విధుల్లో ఉద్యోగులు చేసిన సేవలు మరువలేని అదనపు కలెక్టర్ పాండు పేర్కొ న్నారు. జిల్లా కేంద్రం సంగారెడ్డిలోని మంగళవారం జిల్లా పరిషత్ హాలులో ఝరాసంఘం మండలం సూపరిండెంట్ గా పనిచేస్తూ, పుల్కల్ మండల పరిషత్ కార్యాలయంలో డిప్యూటేషన్‌లో పని చేసి మంగళవారం పదవి విరమణ పొందారు. కార్యక్రమానికి హాజరైన అదనపు కలెక్టర్ పాండు మాట్లాడుతూ...గత 38 ఏళ్లుగా రాములు చేసిన సేవలు కొనియాడారు. ఆయన ఉద్యోగ సమయంలో సరైన సమయం, బాధ్యత నిర్వర్తించేవారన్నారు. రాములు దంపతులకు శేషజీవితం ప్రశాంతంగా గడపాలని కోరారు. ఈ సందర్భంగా రాములును పలు మండలాల ఎంపీడీఓలు, పంచాయతీరాజ్ అధికారులు, సిబ్బంది, అభిమానులు ఘనంగా సన్మానించారు.
వైద్యాధికారికి మెమో
కొండాపూర్(సంగారెడ్డి): ‘బహిరంగ ప్రదేశంలో సర్కారు మాత్రలు’శీర్షికతో ‘సాక్షి’లో మంగళవారం ప్రచురితమైన కథనానికి జిల్లా వైద్యాధికారులు స్పందించారు. కొండాపూర్ మెడికల్ ఆఫీసర్ అనుదీప్‌కు మెమో జారీచేసినట్లు డీఎంహెచ్‌ఓ లలితాదేవి తెలిపారు. డీఎంహెచ్‌ఓ ఆదేశాల మేరకు మంగళవారం డిప్యూటీ డీఎంహెచ్‌ఓ నాగనిర్మల దొబ్బకుంట గ్రామానికి వచ్చి పంచాయతీ కార్యాలయం బయట సర్కారు మందులు పడి ఉండటానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. విచారణ అనంతరం డీఎంహెచ్‌ఓకు తుది నివేదిక అందజేస్తానని నాగనిర్మల తెలిపారు.
కళాశాల విద్యార్థులకు
హాస్టల్ వసతి
దరఖాస్తుల కోసం ఆహ్వానం
హత్నూర(సంగారెడ్డి): హత్నూర మండలం దౌల్తాబాద్ బీసీ సంక్షేమ వసతి గృహంలో ఇంటర్మీడియెట్ చదువుకునే విద్యార్థులకు వసతి సౌకర్యం కోసం దరఖాస్తులు చేసుకోవాలని హాస్టల్ వార్డెన్ బద్రి ప్రసాద్ మంగళవారం తెలిపారు. ఉన్నతాధికారుల ఉత్తర్వుల ప్రకారం దౌల్తాబాద్ బీసీ హాస్టల్ ఇంటర్ చదువుకునే విద్యార్థుల కోసం వసతిగృహంగా మార్చినట్లు తెలిపారు. ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరంతోపాటు డిగ్రీ, బీకాం, ఐటీఐ చదువుకునే విద్యార్థులు సైతం ఈ వసతిగృహంలో ఉండేందుకు ఉన్నతాధికారులు అవకాశం కల్పించినట్లు తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు ఈ హాస్టల్లో ఉండేందుకు స్వయంగా వచ్చి దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. పూర్తి సమాచారానికి ఫోన్ నంబర్ 7989667072కు సంప్రదించాలని ఆయన కోరారు. ఆధార్ కార్డు జిరాక్స్, పదో తరగతి మెమో, కుల,ఆదాయ,నివాస ధ్రువీకరణ పత్రాలు, మూడు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు, బ్యాంకు అకౌంట్ జిరాక్స్, ప్రస్తుతం చదువుతున్న కళాశాల బోనఫైడ్ జతపరిచి దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.
స్థిరమైన వ్యవసాయ
పద్ధతులపై అవగాహన
సదాశివపేట రూరల్(సంగారెడ్డి): ఖేతి బచావో అభియాన్ కార్యక్రమంలో భాగంగా మండలంలోని మందికుంట రైతు వేదికలో మంగళవారం స్థిర వ్యవసాయ పద్ధతులపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. జహీరాబాద్‌లోని డీడీఎస్–కేవీకే వారి ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో శాస్త్రవేత్తలు వ్యవసాయ సాగు పద్ధతులు, ప్రభుత్వ పథకాల గురించి వివరించారు. ప్రోగ్రాం అధికారి స్వామి మాట్లాడుతూ..పోషక విలువల గురించి తెలుసుకోవడానికి తప్పకుండా నేల పరీక్షలు చేయించాలన్నారు. పరీక్షల ఆధారంగానే ఎరువులను వినియోగించాలని చెప్పారు. శాస్త్రవేత్త డాక్టర్ స్నేహలత వరి పంటలో ఆశించే ప్రధాన కీటకాల గురించి వివరించారు. పంట ప్రారంభం దశ నుంచి తీసుకొవల్సిన సస్యరక్షణ చర్యల గురించి తెలిపారు. కార్యక్రమంలో ఉద్యానశాఖ అధికారి సునీత, ఏఈఓ మనోహర్ రైతులు పాల్గొన్నారు.


