న్యాల్‌కల్(జహీరాబాద్): ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు ఎంతో విలువైందని దానిని తొలగించేందుకు కుట్రలు జరుగుతున్నాయని మాజీమంత్రి డాక్టర్ చంద్రశేఖర్ ఆరోపించారు. మండల పరిధిలోని ముంగి చౌరస్తాలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్‌లో మంగళవారం ఎస్‌ఐఆర్‌పై బీఎల్‌ఏలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీఎల్‌ఏలకు గుర్తింపు కార్డులను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ...కాంగ్రెస్ పార్టీకి పట్టున్న ప్రాంతాల్లో పార్టీ సానుభూతి పరుల ఓట్లను తొలగించేందుకు కుట్రలు జరుగుతున్నాయన్నారు. ఓటర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఓటరు జాబితాల్లో తమ పేర్లు ఉన్నాయా?లేదా? తప్పనిసరిగా సరిచూసుకోవాలన్నారు. ఓటరు జాబితాల్లోని ఓట్లను తొలగించడం కాని, ఓటు చోరికి పాల్పడినట్లు తెలిస్తే వెంటనే ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయాలని ఆయన బీఎల్‌ఏలకు సూచించారు. ఎస్‌ఐఆర్‌పై గ్రామాల్లో ఓటర్లకు అవగాహన కల్పించాలని కోరారు. సమావేశంలో టీపీసీసీ అసెంబ్లీ కో–ఆర్డినేటర్ మహమ్మద్‌గౌస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉజ్వల్‌రెడ్డి, జహీరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తిరుపతిరెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి, మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మెన్ సిద్దిలింగయ్య స్వామి, మాజీ జెడ్పీటీసీ చంద్రప్ప, వివిధ గ్రామాలకు చెందిన సర్పంచ్‌లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
బీఎల్‌ఏల అవగాహన సదస్సులో
మాజీమంత్రి చంద్రశేఖర్


