కోహెడరూరల్(హుస్నాబాద్): మండలంలోని ప్రముఖ సింగరాయ లక్ష్మి నరసింహస్వామి పుణ్యక్షేత్రం సమీప జాతర పరిసరాలు, మోయతుమ్మెద వాగు తీవ్ర కాలుష్య కోరల్లో చిక్కుకోనుంది. పర్యావరణ, ఇరిగేషన్ నిబంధనలతో పాటు టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ శాఖ విధించిన నిబంధనలు బేఖాతరు చేస్తూ జాతర గుట్టకు, వాగుకు అతి సమీపంలో ఓ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ భారీ పౌల్ట్రీ ఫారం నిర్మిస్తోంది. ప్రజల ఆరోగ్యాన్ని, భక్తుల మనోభావాలను పణంగా పెట్టి నిర్మించడంపై కోహెడ, బస్వాపూర్ పరిసర ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎత్తులో షెడ్లు.. పల్లంలో వాగు
ఓ సంస్థ నిర్మిస్తున్న భారీ పౌల్ట్రీ షెడ్లు ఎత్తయిన ప్రదేశంలో ఉన్నాయి. దానికి తక్కువ ఎత్తులో మోయతుమ్మెద వాగు ప్రవహిస్తోంది. దీని వల్ల వర్షాకాలంలో కోళ్ల ఫారం నుంచి వెలువడే వ్యర్థాలు, రసాయనాలు వరదతో పల్లపు ప్రాంతమైన వాగులోకి చేరి ప్రాజెక్టులో కలిసే అవకాశం ఉంది. కాగా ప్రాజెక్టు నుంచి పలు గ్రామాలకు తాగు, సాగు నీరు సరఫరా చేస్తున్నారు. పొరపాటున ఆ వ్యర్థాలు ప్రాజెక్టులోకి చేరితే వేలాది మంది ప్రజలు కలుషిత నీటిని తాగి వ్యాధుల బారినపడే అవకాశం ఉంది. దీంతోపాటు పశుగ్రాసం, పంటలు కూడా విషతుల్యంగా మారే ప్రమాదం పొంచి ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
నిబంధనలు గాలికి!
నిబంధనల ప్రకారం పుణ్యక్షేత్రాలు, పర్యాటక కేంద్రాల నుంచి పౌల్ట్రీఫారాలు కనీసం 500 మీటర్ల వెలుపల ఉండాలి. కానీ క్షేత్ర స్థాయిలో జాతర జరిగే గుట్టకు సమీపంలో కనీస నిబంధనలు పాటించలేదన్న ఆరోపణలు వెల్లువెత్తు తున్నాయి. కళ్ల ముందే పుణ్యక్షేత్రం కనిపిస్తున్నా అధికారులు ఈ దూర ప్రమాణాలను రిపోర్టులో ఎలా దాచారని, దీని వెనుక ఉన్న ఆంతర్యమేమిటని భక్తులు ప్రశ్నిస్త్తున్నారు.
పౌల్ట్రీ నిర్మిస్తున్నట్లు తెలియదు
సింగరాయ ప్రాజెక్టు సమీపంలో పౌల్ట్రీ ఫారం నిర్మిస్తున్నట్లు సమాచారం లేదు. ఎంత దూరంలో ఉందో ఏఈని అక్కడికి పంపించి వివరాలు తెలుసుకుంటాం. ప్రస్తుతం ఎలాంటి వివరాలు తెలియదు.
– రఫీ, ఇరిగేషన్, ఈఈ
వాగు ద్వారా ప్రాజెక్టులోకి
పలు గ్రామాలకు పొంచి ఉన్న ప్రమాదం
పర్యాటకంగా అభివృద్ధి చేయాల్సిన చోట పరిశ్రమలా?


