జిన్నారం (పటాన్‌చెరు): గడ్డపోతారం పట్టణ పరిధిలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు జోరుగా కొనసాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా పట్టణ పరిధిలోని సర్వే నం.79తో పాటు వావిలాల గ్రామ పరిధిలో మున్సిపల్ కార్యాలయం నుంచి ఎలాంటి నిర్మాణ అనుమతులు పొందకుండా భారీ షెడ్ల నిర్మాణాలు చేపడుతున్నారని వాపోతున్నారు. కాగా అనుమతులు లేకుండా నిర్మాణాలు జరుగుతుండటంతో మున్సిపాలిటీకి రావాల్సిన ఆదాయానికి భారీగా గండి పడుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని పలుమార్లు మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని, దీంతో అక్రమ నిర్మాణాలు మరింత వేగంగా కొనసాగుతున్నాయని ఆరోపించారు. మరోవైపు ఎలాంటి అనుమతులు లేకుండా హెచ్‌ఎండీఏ అనుమతులు ఉన్నాయంటూ నిర్మాణదారులు తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మున్సిపల్ అధికారులు క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ నిర్వహించి, అనుమతులు లేకుండా చేపట్టిన నిర్మాణాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్


