ఎకరాల్లో
పెంపకంపై రైతుల ఆసక్తి
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): పట్టు పురుగుల పెంపకంతో ప్రతి నెలా ఆదాయం వస్తుందని రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. జిల్లాలో మల్బరి సాగు పెరుగుతుండటంతో పట్టు ఉత్పత్తి కూడా అధికమవుతోంది. కాగా వర్షాలు సక్రమంగా పడకపోవడంతో, సాగు నీటి ఇబ్బందుల దృష్ట్యా సంప్రదాయ పంటలకు స్వస్తి పలికి వాణిజ్య పంటల వైపునకు రైతులు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో అన్నదాతలు ఉద్యాన వన పంటలైన కూరగాయలు, మల్బరి సాగుకు ఆసక్తి చూపుతున్నారు.
1294 ఎకరాల్లో మల్బరి..
సిద్దిపేట జిల్లాలో 2024లో 988 ఎకరాలు సాగులో ఉన్న మల్బరి, 2025లో 1124 ఎకరాలకు, ఈ సంవత్సరం 1294 ఎకరాల్లో సాగవుతుంది. ఈ సాగు ఇంకా పెరిగే అవకాశం ఉంది. మల్బరి ఆకులతో పట్టు పురుగులను పెంచి వాటి నుంచి వచ్చే పట్టుగూళ్లను విక్రయిస్తారు. జిల్లాలో ప్రతి నెల 25 టన్నుల పట్టు గూళ్లు ఉత్పత్తి అవుతున్నాయి. వీటిని విక్రయించేందుకు జనగామ జిల్లా కేంద్రం, తిరుమలగిరిలో కొనుగోలు కేంద్రాలకు రైతులు తీసుకెళ్తున్నారు. కిలో పట్టు గూళ్లకు రూ.700 వరకు మద్దతు ధర పలుకుతుంది. కాగా విక్రయించిన మూడు రోజుల్లోనే డబ్బులు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వ రాయితీలు
కేంద్ర ప్రభుత్వం పట్టు పరిశ్రమను ప్రోత్సహించేందుకు పట్టు రైతులకు సబ్సిడీలు అందిస్తుంది. నీటి సౌకర్యానికి సాధారణ రైతులకు రూ.50వేలు, ఎస్సీ, ఎస్టీ రైతులకు రూ. 65వేలు రాయితీ ఇస్తోంది. పట్టు పురుగుల షెడ్డుకు సాధారణ రైతులకు రూ.2.25లక్షలు, ఎస్సీ, ఎస్టీ రైతులకు రూ.2,92,500, పరికరాలకు సాధారణ రైతులకు రూ.37,500, ఎస్సీ,ఎస్టీ రైతులకు రూ.48,750 అందిస్తుంది. కిసాన్ నర్సరీకి సాధారణ రైతులకు రూ.75వేలు, ఎస్సీ, ఎస్టీ రైతులకు రూ.97,500 రాయితీ ఇస్తోంది.
సంవత్సరం మల్బరి సాగు విస్తీర్ణం
2024 988
2025 1124
2026 1294
జిల్లాలో 1294 ఎకరాల్లో మల్బరి సాగు
నెలకు 25 టన్నుల పట్టు గూళ్లు ఉత్పత్తి
సంప్రదాయ పంటలకు ప్రత్యామ్నాయం


