ఉలిక్కిపడిన దుబ్బాక | - | Sakshi
Sakshi News home page

ఉలిక్కిపడిన దుబ్బాక

Jun 30 2026 6:55 AM | Updated on Jun 30 2026 6:55 AM

దుబ్బాక: దుబ్బాక పట్టణంలో ఆదివారం రాత్రి జరిగిన భారీ చోరీ ఘటనతో ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. పట్టణానికి చెందిన వ్యాపారస్తుడు చింత రాజ్‌కుమార్‌ కుటుంబంతో 9 రోజుల క్రితం కాశీయాత్రకు వెళ్లారు. ఇటీవల రాజ్‌కుమార్‌ కొత్తగా బిల్డింగ్‌ నిర్మించుకొని అందులో ప్రత్యేకంగా లాకర్‌ను సైతం ఏర్పాటు చేసుకున్నాడు. కాశీయాత్రకు వెళ్లేముందు ఇంట్లోని 1.5 కిలోల బంగారు నగలు, 8 కిలోల వెండి, రూ.8 లక్షల నగదును లాకర్‌లో భద్రపరిచాడు. గుర్తుతెలియని దుండగులు పక్కా ప్లాన్‌ ప్రకారం ఇంట్లోకి చొరబడి లాకర్‌ను ధ్వంసం చేసి అందులో ఉన్న బంగారం, వెండి, నగదును ఎత్తుకెళ్లడం తీవ్ర సంచలనంగా మారింది.

పక్కా ప్లాన్‌తోనే..

దుండగులు పక్కా ప్లాన్‌తోనే చోరీకి పాల్పడ్డట్లు సంఘటన తీరుతెన్నులను చూస్తే అర్థం అవుతుంది. రాజ్‌కుమార్‌ కుటుంబం కాశీయాత్రకు వెళ్లడం నుంచి లాకర్‌లో పెద్ద ఎత్తున బంగారం, నగదు ఉన్నట్లు తెలిసిన వారే ఈ చోరీకి పాల్పడ్డట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంటి వెనుక వైపు నుంచి కిటికీ ఇనుప చువ్వలను ధ్వంసం చేసి ఇంట్లోకి చొరబడ్డారు. లాకర్‌ను ధ్వంసం చేసి పెద్ద ఎత్తున దోచుకెళ్లడం తీవ్ర సంచలనంగా మారింది. ఇదంతా ఆ ఇంటి గురించి అన్నీ తెలిసి ఉన్నవారి పనేనా? లేక వారిచ్చిన సమాచారంతో చోరీల్లో ఆరితేరిన వారు చేసిన పనిలాగా తెలుస్తుంది.

సీసీ ఫుటేజీ హార్డ్‌డిస్క్‌ సైతం..

దుండగులు సీసీ ఫుటేజీ హార్డ్‌డిస్క్‌ను సైతం ఎత్తుకెళ్లడం శోచనీయం. సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫుటేజీ లేకుండా హార్డ్‌డిస్క్‌ను తీసుకపోవడంతో పాటు ఎలాంటి ఆనవాళ్లు లేకుండా పలు జాగ్రత్తలు వహించడం చూస్తుంటే పక్కా ప్రొఫెషనల్‌ దొంగల పనేనా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

కుటుంబీకులు వస్తే గాని..

కాశీకి వెళ్లిన బాధిత కుటుంబం వస్తేగాని ఎంత చోరీ అయిందన్న విషయంతో పాటు అనుమానిత వ్యక్తులకు సంబంధించిన సమాచారం తెలిసే అవకాశాలున్నాయి. బాధిత కుటుంబం అర్ధరాత్రి వరకు ఇంటికి చేరుకోనున్నట్లు తెలిసింది.

వరుస చోరీలతో భయాందోళన..

దుబ్బాకలో భారీ చోరీ ఘటనే కాకుండా కొన్ని రోజులుగా హుస్నాబాద్‌, కొమురవెళ్లి, చేర్యాల ప్రాంతాల్లో జరిగిన సంఘటనలు సైతం ఉన్నాయి. తాజాగా దుబ్బాకలో జరిగిన భారీ చోరీ ఘటనతో జిల్లా వ్యాప్తంగా ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

కిలోన్నర బంగారు నగలు, వెండి,భారీ నగదు అపహరణ

సీసీ ఫుటేజీలోని హార్డ్‌డిస్క్‌నుతీసుకెళ్లిన దుండగులు

కాశీయాత్రకు వెళ్లిన బాధిత కుటుంబం

సీపీ రష్మీ పెరుమాళ్‌ ఆధ్వర్యంలోకేసు దర్యాప్తు

క్లూస్‌టీం తనిఖీలు

భారీ చోరీ ఘటనతో సీపీ రష్మీ పెరుమాళ్‌ ఆధ్వర్యంలో పోలీస్‌ ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. ప్రత్యేకంగా క్లూస్‌టీంలు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. డాగ్‌స్క్వాడ్‌లతో ఇంటితో పాటు పరిసర ప్రాంతాలను గాలించారు. డాగ్‌ స్క్వాడ్‌ ఇంటి నుంచి దుంపలపల్లి రోడ్డు వరకు కొంత దూరం వెళ్లి ఆగిపోవడంతో దుండగులు అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు అన్వేషిస్తున్నారు.

పూర్తిస్థాయిలో దర్యాప్తు: సీపీ

చోరీ ఘటనపై అన్ని కోణాల్లో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు సీపీ రష్మీ పెరుమాళ్‌ వెల్లడించారు. ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపడంతో పాటు క్లూస్‌టీంలు, డాగ్‌ స్క్వాడ్‌తో ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నిందితులకు పట్టుకుంటామని చెప్పారు.

భారీ చోరీతో భయాందోళనలో ప్రజలు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement