వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్
సిద్దిపేటరూరల్: ఓటరు జాబితాలో పేరు ఉండాలంటే ప్రతి ఒక్కరూ ఎస్‌ఐఆర్ ప్రక్రియకు సహకరించాలని కలెక్టర్ హైమావతి సూచించారు. సోమవారం భారత ఎన్నికల సంఘం నిర్దేశిత కార్యాచరణ ప్రకారం ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ చేపట్టాలని కోరుతూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ఓటరు జాబితాలో పేరు ఉండాలంటే కచ్చితంగా ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తిచేసి అధికారులకు అందించాలన్నారు. ప్రతి ఈఆర్‌ఓ, ఏఈఆర్‌ఓ, క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యటిస్తూ, ప్రతి ఎన్యూమరేషన్ ఫారంపై సంబంధిత ఓటరు సంతకం ఉండేలా బూత్ స్థాయి అధికారులు నిర్ధారించేలా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్, జిల్లా రెవెన్యూ అధికారి డి.నాగరాజమ్మ, అదనపు కలెక్టర్లు, ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు.
ఉత్తమ ఉపాధ్యాయులకు దరఖాస్తులు
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): సిద్దిపేట జిల్లాలోని జెడ్పీ, ప్రభుత్వ, మండల పరిషత్ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు, ప్రధా నోపాధ్యాయుల నుంచి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి శాస్త్రి ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల వారు జూలై 10లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు ఫారంలను జూలై 13 లోపు డీఈవో కార్యాలయంలో అందించాలన్నారు.
ప్రభుత్వ విత్తనాలనే సాగు చేయాలి
దుబ్బాకరూరల్: మండలంలోని తిమ్మాపూర్ రైతు వేదికలో సోమవారం వరి సన్న విత్తనాల మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీనివాస్, ఎఫ్‌పీఓ చైర్మన్ రంగారెడ్డి మాట్లాడుతూ రైతులు ప్రభుత్వం అందించే వరి విత్తనాలనే వాడాలని తెలిపారు. ఏడు రకాల సన్న వడ్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. బీపీటీ–5204, ఆర్‌ఎన్‌ఆర్–15048, కేఎన్‌ఎం–1638, జై శ్రీరామ్ –హెచ్‌ఎంటి సోనా, వరంగల్–44, కేఎన్‌ఎం–7715, ఎంటీటూ–1010, జేజీఎల్–24423, కేఎన్‌ఎం–118లను సాగు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ రేణుక రైతులు తదితరులు పాల్గొన్నారు.
ప్రైవేటు ఆఫీసులో నగదు చోరీ
గంటల్లోనే కేసు ఛేదించిన పోలీసులు
నర్సాపూర్: ప్రైవేట్ ఆఫీసులో చోరీ జరిగింది. ఈ ఘటన నర్సాపూర్‌లో చోటు చేసుకుంది. సీఐ రంగకృష్ణ కథనం ప్రకారం... మెదక్‌కు చెందిన మేడి శ్రీధర్ రేడియంట్ క్యాష్ మేనేజ్‌మెంట్ సర్వీస్‌లో క్యాషియర్‌గా పని చేస్తూ నర్సాపూర్ ప్రాంతంలోని అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మేషియో, షాడో ఫ్యాక్స్ టెక్నాలజీ సంస్థల నుంచి రోజూ వారి నగదును సేకరించే బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. కాగా ఈనెల 26నుంచి 28 వరకు సెలవులు ఉండటంతో ఆ సంస్థల కార్యాలయాల్లో నగదు ఉందని, దానిని ఎలాగైనా కాజేయాలనుకున్నాడు. ఈ క్రమంలో టిఫిన్ సెంటరు నిర్వహించే తన బంధువు రవితో కలిసి చోరీకి కుట్ర చేశాడు. ఆదివారం అర్ధరాత్రి ఇద్దరూ నర్సాపూర్ వచ్చి కార్యాలయం వెనుక తలుపులను తెరిచి లోపల ఉన్న సీసీ కెమెరాలు ఆఫ్ చేశారు. ఆఫీసులో ఉన్న రూ. 2లక్షల 66వేల 850 , సీసీ టీవీ డీవీఆర్‌ను ఎత్తుకెళ్లారు. కాగా సోమవారం పట్టణంలో పోలీసులు చౌరస్తా వద్ద అనుమానాస్పదంగా కన్పించిన టీవీఎస్ స్కూటీని ఆపి తనిఖీ చేయగా అందులో నగదుతోపాటు డీవీఆర్ లభించాయి. కాగా నగదుతో పాటు సీసీటీవీ డీవీఆర్, చోరీకి వినియోగించిన స్కూటీని స్వాధీనం చేసుకొని, నిందితులను అరెస్టు చేశారు. కాగా చోరీ జరిగిన కొన్ని గంటల్లోనే కేసును చేధించిన పోలీసులను జిల్లా పోలీసు అధికారులు అభినందించారు.
బార్బర్ ఆత్మహత్య
దుబ్బాకటౌన్: సెలూన్ దుకాణంలో బార్బర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన దుబ్బాక పట్టణంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యులు కథనం ప్రకారం... పట్టణంలోని లచ్చపేట 11వ వార్డుకు చెందిన మిరుదొడ్డి స్వామి (42) దుబ్బాక బస్టాండ్ సమీపంలో హెయిర్ సెలూన్ దుకాణం నిర్వహిస్తూ, భార్య రజిత, కుమారుడు సహాస్‌తో జీవిస్తున్నాడు. ఈ క్రమంలో సాయంత్రం స్వామి దుకాణం లోపల షట్టర్ కిందికి వేసి, తాడుతో ఉరివేసుకున్నాడు. కొంతసేపటి తర్వాత అందులో పని చేసే వ్యక్తి వచ్చి షట్టర్ పైకి లేపి చూడగా స్వామి మృతదేహం కనిపించింది. వెంటనే అతడు పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం వంద పడకల ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. ఇంకా ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.
కడుపునొప్పి భరించలేక..
తూప్రాన్: కడుపునొప్పి భరించలేక వృద్ధురాలు ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన పట్టణ కేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ గంగరాజు తెలిపిన వివరాల ప్రకారం... పట్టణంలోని 5వ వార్డులో నివాసం ఉంటున్న ఉప్పు వీరమ్మ(72) కొలంగా కడుపునొప్పితో బాధపడుతుంది. ఈ క్రమంలోనే ఇంట్లో ఎవరులేని సమయంలో ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుంది. మృతురాలి కుమారుడు సంతోష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.


