డీఈఓ రాజు, ఎమ్మెల్యే సునీతారెడ్డి
కొల్చారం(నర్సాపూర్): విద్యలో ప్రతిభ కనబరుస్తూ విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని డీఈఓ రాజు, ఎమ్మెల్యే సునీతారెడ్డి సూచించారు. సోమవారం మండలంలోని రంగంపేట ఉన్నత పాఠశాలలో ఈ ఏడాది పదో తరగతి పరీక్షల్లో 500కు పైగా మార్కులు సాధించిన 49 మంది విద్యార్థులకు పాఠశాల ఆధ్వర్యంలో ’ప్రతిభా పురస్కారాల సన్మాన కార్యక్రమం’ నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా హాజరైన డీఈఓ, ఎమ్మెల్యే.. ప్రతిభ చాటిన విద్యార్థులను శాలువాలతో సత్కరించి, మెమోంటోలు అందించి అభినందించారు. అనంతరం పాఠశాలకు చెందిన విద్యార్థులు భవ్యశ్రీ రచించిన ‘ఒక కళ కోసం’, కుమ్మరి అక్షయ రచించిన ‘సారె సాక్షిగా ’ పాఠశాల పీడీ శ్రీధర్ రెడ్డి రచించిన ‘ పురాణ కథామృతం’ పుస్తకాలను ఆవిష్కరించారు.
అనంతరం డీఈఓ మాట్లాడుతూ.. ఈ ఏడాది వెలువడిన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో పాఠశాల విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించడం హర్షించదగ్గ విషయమన్నారు. ఎమ్మెల్యే సునీత రెడ్డి మాట్లాడుతూ.. పాఠశాలలో బాలకవులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు చేసిన కృషి అభినందనీయమన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ స్వర్ణలత, ఎంపీడీఓ రఫీక్ ఉన్నీసా, ఎంఈఓ ఉమారాణి, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ రమేష్ కుమార్, పాఠశాల చైర్మన్ మాధవి, ఉపసర్పంచ్ సురేష్, తపస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జాలసిద్దు, పీఆర్టీయూ మండల అధ్యక్షులు సత్యనారాయణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


