నర్సాపూర్: మురికి నీరు నిల్వ ఉండకుండా సాఫీగా వెళ్లేందుకు మురికి కాల్వవలు నిర్మించి సమస్యను పరిష్కరిస్తామని మున్సిపల్ చైర్‌పర్సన్ లక్ష్మి, కమిషనర్ సాయికుమార్ తెలిపారు. సోమవారం వారు పట్టణంలోని 6వ వార్డులో పర్యటించారు. ఆదివారం కురిసిన వర్షాలకు వార్డులోని పలు వీధుల్లో వర్షం నీరు నిలిచిపోయిందని, తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని వార్డు ప్రజలు వారి దృష్టికి తెచ్చారు. స్పందించిన చైర్‌పర్సన్, కమిషనర్‌లు వార్డు అంతటా పర్యటించి నీరు నిలిచిన ప్రాంతాలను పరిశీలించారు. వార్డులో అవసరాన్ని బట్టి మురికి కాల్వలు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి తక్షణమే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మున్సిపల్ ఏఈ కృష్ణయ్యను ఆదేశించారు. ఈ పర్యటనలో మున్సిపల్ ఏఈ కృష్ణయ్య, శానిటరీ ఇన్‌స్పెక్టర్ మురళి, వార్డు ఆఫీసర్లు ఉదయ్, కాంగ్రెస్ నాయకుడు ఇలియాస్ తదితరులు పాల్గొన్నారు.
లైసెన్సు తప్పనిసరి: కమిషనర్
మున్సిపాలిటీ పరిధిలో వ్యాపారం చేస్తున్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వృత్తి, వ్యాపార లైసెన్సు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ సాయికుమార్ సూచించారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించే వారు ఆన్‌లైన్ ద్వారా లైసెన్సు పొందాలని, ఇప్పటికే లైసెన్సు ఉన్నవారు సకాలంలో రెన్యువల్ చేసుకోవాలని తెలిపారు. లైసెన్సు లేకుండా వ్యాపారాలు నిర్వహిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు జరిమానా విధిస్తామని కమిషనర్ హెచ్చరించారు.


