మెదక్ కలెక్టరేట్: కాంగ్రెస్‌పార్టీ ఎన్నికల హామీ ప్రకారం బీడీ కార్మికులకు ఎలాంటి షరతులు లేకుండా జీవన భృతి పెంచి అమలు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి మల్లేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా సోమవారం మెదక్ సమీకృత కలెక్టరేట్ ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో బీడీ కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లేశం మాట్లాడుతూ.. రాష్ట్రంలో వ్యవసాయం తర్వాత బీడీ పరిశ్రమ పెద్ద ఉపాధి కల్పిస్తున్న పరిశ్రమగా ఉందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల విధానాల ఫలితంగా జీఎస్‌టీ పేరుతో పన్నులు పెంచడం, పుర్రెగుర్తు సైజు పంచడంపై బీడీ పరిశ్రమ దెబ్బ తింటుందన్నారు. బీడీ కార్మికులకు షరతులు లేని జీవన భృతిగా రూ.4016 అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులను మోసం చేస్తున్న ఠాకూర్, ఉత్తమ్ బీడీ యాజమాన్యాలపై చర్య తీసుకోవాని కలెక్టర్ ప్రతిమాసింగ్‌కు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బాలమణి, మంజుల, సీఐటీయూ నాయకులు సంతోష్, బీడీ కార్మికులు పాల్గొన్నారు.


