కొండపాక(గజ్వేల్): రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా... బందారం గ్రామానికి చెందిన నీల అనిల్(24) సిద్దిపేటలోని కార్ల విక్రయ షోరూంలో పని చేస్తున్నాడు. ఈనెల 26న మొహర్రం పండుగ నేపథ్యంలో ద్విచక్ర వాహనంపై మర్పడ్గ మధిర నాగిరెడ్డిపల్లిలోని అక్క ఇంటికి వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో రాత్రి సిద్దిపేటకు వెళ్తుండగా మర్పడ్గ శివారులో వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న గుంతలో పడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. శనివారం ఉదయం అటుగా వెళ్తున్న వారు చూసి కుటుంబీకులకు సమాచారం అందించి, అంబులెన్సులో ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. మృతునికి సుమారు 45 రోజుల కిందట వివాహమైంది. మృతదేహం వద్ద కుటుంబీకులు, బంధువులు బోరున విలపించిన తీరు అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. మృతుని కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు త్రీటౌన్ ఎస్సై మల్లేశం తెలిపారు.


