పిడుగుల కాలం జాగ్రత్త | - | Sakshi
Sakshi News home page

పిడుగుల కాలం జాగ్రత్త

Jun 29 2026 7:21 AM | Updated on Jun 29 2026 7:21 AM

ముందు జాగ్రత్తలు పాటిస్తే ప్రాణాలు కాపాడుకోవచ్చు

మేఘ్‌దూత్‌తో వర్ష సమాచారం

అప్రమత్తంగా ఉండాలి

హెచ్చరిస్తున్న దామిని యాప్‌

సదాశివపేట(సంగారెడ్డి): వానాకాలంలో పిడుగులతో అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. పిడుగుపాటుకు జిల్లాలో పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం కాగానే ఉరుములు, మెరుపులతో కురిసే వర్షం చాలా కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపుతోంది. రైతులు కూలీలు, పశువుల కాపరులను పిడుగుల రూపంలో మృత్యువు బలి తీసుకుంటుంది. పిడుగుపాటుకు గురికాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

దామిని అలర్ట్‌తో సురక్షిత ప్రదేశానికి..

పిడుగులతో ఏటా పదుల సంఖ్యలో ప్రజలు, వందల సంఖ్యలో పశుసంపదకు ప్రాణనష్టం సంభవిస్తోంది. ఈ ప్రమాదం నుంచి రక్షించుకునేందుకు ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెటియోరాలజీ ఎర్త్‌ సిస్టమ్‌ సైన్స్‌ ఆర్గనైజేషన్‌ సంయుక్తంగా దామిని యాప్‌ను అందుబాటులోకి తెచ్చాయి. ఇది 500 మీటర్ల కంటే తక్కువ వ్యాసార్థంలో పిడుగులు పడే పరిధిని గుర్తించి జీపీఎస్‌ నోటిఫికేషన్‌ ద్వారా హెచ్చరిస్తుంది. దీంతో పిడుగులు పడే ప్రాంతానికి దూరంగా వెళ్లి ప్రాణ ఆస్తి నష్టం నుంచి రక్షణ పొందవచ్చు.

ప్రాణాలు కోల్పోతున్న..

మండలంలోని వెంకటాపూర్‌ గ్రామానికి చెందిన చింతకుంట అనిల్‌ తన మేనల్లుడు సిద్ధార్థ్‌తో కలిసి ఇశ్రీతాబాద్‌ గ్రామశివారులో పశువులు మేపుతున్నాడు. శుక్రవారం ఉరుములు, మెరుపులు భారీ శబ్దాలతో పిడుగుపడి అనిల్‌ ప్రాణాలు కోల్పోగా సిద్దార్థ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనే కాదు ఏటా వానాకాలంతో పాటు ఇతర సమయాల్లో పిడుగుపాటుకు మనుషులే కాకుండా ఇటు పశువులు సైతం ప్రాణాలు కోల్పోతున్నారు.

ఈ జాగ్రత్తలు పాటించాలి

ఉరుములతో కూడిన వర్షం కురుస్తున్న సమయంలో బయట ప్రాంతాల్లో ఉన్నవారు ఏదైనా సురక్షిత ప్రాంతానికి వెళ్లి మోకాళ్లపై చేతులు తలపెట్టి దగ్గరగా ముడుచుకుని కూర్చోవాలి. ఎత్తయిన చెట్లు టవర్ల కిందకు వెళ్లకూడదు. చెట్లు పిడుగులను ఆకర్షించుకుంటాయి. ఇనుప గొడుగులు వేసుకుని బయటకు వెళ్లరాదు. ఫోన్లు, ఎఫ్‌ఎం రేడియో వంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలు ఉపయోగించరాదు. ఉరుములు, మెరుపులు వచ్చే సమయాల్లో పొలాల్లో పనిచేస్తున్న రైతులు కూలీలు, పశువుల కాపర్లు బహిరంగ ప్రదేశాల్లో ఉండేవారు ముందుగానే భూమి పొడిగా ఉండే సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలి.

భారత వాతావరణ శాఖ ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెటీరియాలజీ ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ రీసెర్చ్‌ సంయుక్తంగా వర్షంపై ముందస్తు సమాచారం తెలియజేసేందుకు మేఘ్‌దూత్‌ యాప్‌ను రూపొందించింది. దీన్ని గూగుల్‌ ప్లే స్టోర్‌లోకి వెళ్లి మొబైల్‌ నంబరు, రాష్ట్రం, జిల్లా మండలం పంచాయతీ వివరాలు నమోదు చేసి లాగిన్‌ అవడంతో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఈ యాప్‌ ద్వారా వర్షం ఉష్ణోగ్రత గాలి వేగం, గాలిదిశ, గాలిలో తేమశాతం తదితర వివరాలను ముందుగానే తెలుసుకోవచ్చు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement